- సిటిజన్ల సమస్యలను పట్టించుకోవట్లే
- ఫోన్ కాల్స్ కి రెస్పాన్స్ ఇవ్వని కమిషనర్ నుంచి డీసీ స్థాయి ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ అధికారులు సిటీ జనానికి అందుబాటులో ఉండట్లేదు. విజిటింగ్టైమ్ లో కూడా ఫీల్డ్ పేరుతో తప్పించుకుంటున్నారు. దీంతో సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు సిటిజన్స్ కు అవకాశం ఉంటలేదు. డిప్యూటీ, జోనల్ కమిషనర్ల ఆఫీసులతో పాటు బల్దియా హెడ్డాఫీసుకు సమస్యలు చెప్పుకునేందుకు వస్తోన్న సిటిజన్లకు ఆఫీసర్లు అందుబాటులో ఉండట్లేదు. గంటల తరబడి వెయిట్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో జనం వెనుతిరుగుతున్నారు. కొందరు అధికారులు ఆఫీసులో ఉన్నా జనాలను కలిసేందుకు ఇష్టపడటం లేదు. ఎంతసేపు వెయిట్ చేసినా సార్ మీటింగ్‌లో ఉన్నారనే సమాధానమే అటెండర్ల నుంచి వస్తోందని జనాలు చెప్తున్నారు. కరోనాకు ముందు ప్రతి సోమవారం బల్దియా హెడ్డాఫీసులో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారించి సంబంధిత ఆఫీసర్లు న్యాయం చేసేవారు. గతంలో కమిషనర్, అడిషనల్ కమిషనర్లు ప్రజావాణిలో అందుబాటులో ఉండడంతో కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం దొరికేది. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేటికీ కరోనా సాకు..
దేశమంతా కరోనా తీవ్రత తగ్గుతుంటే బల్దియాలో మాత్రం కరోనా సాకుతో అధికారులు జనానికి దూరంగా ఉంటున్నారు. హెడ్ ఆఫీసులోకి సాధారణ జనాన్ని మధ్యాహ్నం 3 గంటల తర్వాతే అనుమతిస్తున్నారు. అంతకుముందు లోపలికి వెళ్లే వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. సాయంత్రం దాకా వేచి ఉండి సమస్యలపై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసేందుకు కలుద్దామని వచ్చినా అవకాశం ఇవ్వడం లేదు. ఫీల్డ్ పేరుతో కొందరు ఆఫీసర్లు తప్పించుకుంటున్నారు. ఎక్కువ మంది టౌన్ ప్లానింగ్, భూముల సమస్యలు, రోడ్లు, హెల్త్, శానిటేషన్ తదితర వాటిపై ఫిర్యాదులు చేసేందుకు వస్తున్నారు. గ్రీవెన్స్ సెల్‌కు కంప్లయింట్ చేయమని చెప్తున్నారే తప్ప ఆఫీసర్లు మాత్రం నేరుగా కలిసేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. గతంలో ప్రతి నెలా కమిషనర్, ఇతర శాఖల అధికారులతో కలిసి మేయర్ ఫేస్ టూ ఫేస్ నిర్వహించేవారు. ఇందులో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేవారు.
ఉమ్మడి ఏపీలో గ్రేటర్ మేయర్లుగా మాజిద్ హుస్సేన్, బండ కార్తీకా రెడ్డి ఉన్న టైమ్ లో ఈ కార్యక్రమానికి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత మేయర్ గా పనిచేసిన బొంతు రామ్మోహన్ కూడా కొన్నాళ్ల పాటు ఫేస్ టు ఫేస్ నిర్వహించి కరోనాకు ముందే ఈ ప్రోగ్రామ్ ను నిలిపి వేశారు. సిటీలో ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి కేటీఆర్ చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. బల్దయా కమిషనర్ నుంచి జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంఓహెచ్‌లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల వరకు ఎవరూ జనాల ఫోన్‌కాల్స్ కు రెస్పాన్స్ కావడం లేదు. సమస్యలు చెప్పుకునేందుకు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా అధికారులు కాల్ లిఫ్ట్ చేయట్లేదని జనాలు చెప్తున్నారు. నేరుగా ఆఫీసులకు వస్తే కలవడం లేదని, ఫోన్ చేసి చెబుదామంటే అధికారులు స్పందించడం లేదని జనం మండిపడుతున్నారు.