ఎస్ఎన్డీపీ ఫేజ్-2కు రూ.2 వేల కోట్లు కావాలని రిక్వెస్టులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో జీహెచ్ఎంసీ క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఇటీవల ప్రకటించిన 2023 – 24 బడ్జెట్లోనూ ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దీంతో అభివృద్ధి పనులకు ఫండ్స్ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక బల్దియా ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రేటర్ సిటీలో వరదల నివారణ కోసం చేపట్టిన ఎస్ఎన్ డీపీ(స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్) ఫేజ్–1 పనుల కోసం జీహెచ్ఎంసీ రూ.700 కోట్లు అప్పు చేసింది. తాజాగా ఫేజ్– 2 పనుల కోసం అప్పుల వేట మొదలుపెట్టింది. ఫేజ్–2లో భాగంగా 80 నాలాలు నిర్మించాలని నిర్ణయించగా, ఇందుకు రూ.2 వేల కోట్ల వరకు కావాలి. ఖజానా ఖాళీగా ఉండడంతో పనులు జరగాలంటే అప్పు తప్ప వేరే మార్గం లేదని బల్దియా అధికారులు చెబుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల ఐఎఫ్‌సీ బ్యాంకును ఆశ్రయించినట్లు తెలిసింది. కాస్త ఆలస్యమైనా ఈసారి తక్కువ వడ్డీతో అప్పు తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జీహెచ్ఎంసీ వేర్వేరు పనుల కోసం రూ.5,275 కోట్లు అప్పు చేసింది. ఇందుకు డైలీ రూ.కోటి 20 లక్షలు వడ్డీ చెల్లిస్తోంది. కొత్తగా మళ్లీ అప్పు కోసం ప్రయత్నాలు చేస్తుండడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వకుండా అప్పులు చేయించడం కరెక్ట్కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది కష్టమే..
రెండేళ్లుగా భారీ వర్షాలతో సిటీలోని వందలాది కాలనీలు నీట మునిగాయి. వానల టైంలో ఆయా కాలనీలవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదలు నివారించేందుకు ఎస్ఎన్ డీపీ ఫస్ట్ ఫేజ్ కింద రూ. 737.45 కోట్లతో సిటీ వ్యాప్తంగా 37 నాలాల పనులు చేపట్టగా ఇంకా పూర్తి కాలేదు. చాలా చోట్ల నెమ్మదిగా సాగుతున్నాయి. వానల టైంలో త్వరగా పూర్తిచేయాలని హడావుడి చేస్తున్న అధికారులు, మంత్రులు తర్వాత పట్టించుకోవడం లేదు. మరోవైపు ఫస్ట్ ఫేజ్ పూర్తిచేసి సెకండ్ ఫేజ్ పనులు మొదలుపెడతామని అధికారులు చెబుతున్నారు. అలా అయితే ఈ ఏడాది మొదలుకావడం కష్టమే అనిపిస్తోంది. బ్యాంకులు లోన్శాంక్షన్చేసినా, ఇప్పటికిప్పుడు పనులు మొదలుపెట్టడం సాధ్యం కాదని, టెండర్ల ప్రక్రియ పూర్తిచేసే లోపే వర్షా కాలం వస్తుందని అంటున్నారు. ఫండ్స్వస్తే వానా కాలం తర్వాత స్టార్ట్చేసే అవకాశం ఉందని పలువురు అధికారులు చెబుతున్నారు. ఫస్ట్ ఫేజ్‌లోని 37 పనుల్లో ఇప్పటివరకు కేవలం రెండు చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి. వచ్చే వానా కాలం నాటికి కూడా మిగిలిన పనులు పూర్తిచేసేలా కనిపించడం లేదు.
ఏ పనులకు ఎంత అప్పు అంటే..
జీహెచ్ఎంసీ వివిధ పనుల కోసం ఇప్పటికే ఆయా బ్యాంకుల్లో రూ.5,275కోట్ల అప్పు చేసింది. ఎస్ఆర్డీపీ(స్ట్రాటజిక్రోడ్డెవలప్ మెంట్ప్రోగ్రామ్)కోసం 8.65 శాతం వడ్డీ కింద రూ.2,500 కోట్లు, సీఆర్ఎంపీ(కాంపెన్సివ్ రోడ్మెయింటెనెన్స్ ప్రోగ్రామ్)కోసం 7.20 శాతం వడ్డీతో రూ.1,460 కోట్లు, మళ్లీ ఎస్ఆర్డీపీ పనుల కోసమే బాండ్ల ద్వారా 490 కోట్లు తీసుకోగా ఇందులో రూ.200 కోట్లు 8.90 శాతం వడ్డీ కింద, 190 కోట్లు 9.38 శాతం, రూ.100 కోట్లు 10.23 శాతం వడ్డీకి తీసుకుంది. అలాగే హడ్కో ద్వారా వాంబే హౌసింగ్ స్కీమ్ కోసం రూ.140 కోట్లు అప్పు చేసింది. ఇందులో రూ.100 కోట్లకు 10.15 శాతం, రూ.40 కోట్లకు 9.90 శాతం వడ్డీ చెల్లిస్తోంది. వీటితోపాటు గతేడాది ఆగస్టు తరువాత నాలాల పనుల కోసం రూ.685 కోట్ల అప్పు తీసుకుంది. మొత్తంగా రూ.5,275 కోట్ల అప్పు చేయగా, వాటికి ఏడాదికి రూ.400 కోట్లకుపైగా వడ్డీ చెల్లిస్తోంది.