హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం ఆదాయం గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.347కోట్ల వరకు తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిర్మాణాల అనుమతుల ద్వారా బల్దియాకు రూ.1,454.76 కోట్లు రాగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,107.29 కోట్లు వచ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
గ్రేటర్ పరిధిలో 2023–24లో మొత్తం 2,456 బిల్డింగులకు పర్మిషన్లు ఇవ్వగా ఇందులో 130 హైరైజ్ బిల్డింగులు ఉన్నాయి. అత్యవసర అప్రూవల్స్8,122 ఇచ్చినట్లు పేర్కొన్నారు. సింగిల్ విండో ద్వారా 2,456 పర్మిషన్లు ఇచ్చినట్లు తెలిపారు.
2,567 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసినట్టు చెప్పారు. ఇనిస్టిట్యూషనల్నిర్మాణాలకు 34 అప్రూవల్స్ ఇవ్వగా ఇందులో 12 హైరైజ్ ఉన్నట్టు తెలిపారు. 2,282 రెసిడెన్షియల్ బిల్డింగులకు అప్రూవల్స్ఇవ్వగా ఇందులో 74 హైరైజ్ భవనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. భవనాల ఎత్తు 188.6 మీటర్ల వరకు అనుమతులు ఇచ్చినట్టు అధికారులు చెప్పారు. గచ్చిబౌలిలో అత్యధికంగా 51 ఫ్లోర్లకు పర్మిషన్ఇచ్చినట్లు వెల్లడించారు.