బట్టతలకు బై బై?

బట్టతలకు బై బై?
  • చిట్టెలుకకు వెంట్రుకలు మొలిపించిన సైంటిస్టులు
  • త్వరలో మనుషులపై టెస్టింగ్

బట్టతలకు పరిష్కారం దొరికేసినట్లే కనిపిస్తోంది! మనుషుల మూలకణాలను వాడి, బోడి చిట్టెలుకకు సైంటిస్టులు కొత్త వెంట్రుకలు మొలిపించారు. తొలుత చిట్టెలుక, మనుషుల్లోని డెర్మల్ పాపిలా అనే కణాలను కలిపారు. అనంతరం దాన్ని చిట్టెలుక చర్మం లోపల ప్రవేశపెట్టారు. కొద్దిరోజులకు సహజంగా వెంట్రుకలు మొలిచాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పడుతున్న బాధకు చెక్ పెట్టొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. వయసు పెరిగో, జీన్ సమస్యల వల్లో, జబ్బుల కారణంగానో చాలా మందిని బట్ట తల సమస్య వేధిస్తోంది. గతంలో ఇలాంటి టెక్నిక్‌‌ను కొందరు పరిశోధకులు ఆవిష్కరించినా, జుట్టు పెరుగుదలను కంట్రోల్ చేయలేం.ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టిన టెక్నిక్‌‌తో అదుపు చేయొచ్చట. అంతేకాకుండా చాలా సహజంగా కనిపిస్తుంది.

అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌‌లో గురువారం జరిగిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ (ఐఎస్ఎస్సీఆర్) సదస్సులో శాన్ ఫర్డ్ బర్న్ హమ్ ప్రీబీస్ మెడికల్ డిస్కవరీ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు బట్ట తలను నిరోధించే కొత్త స్టెమ్ సెల్ పద్ధతి గురించి వివరించారు. ‘స్టెమ్ సన్ థెరాపటిక్స్’ అనే కంపెనీ అతి త్వరలో ఈ కొత్త టెక్నిక్ అభివృద్ధి చేసి, మనుషులపై టెస్టు చేస్తుందని చెప్పారు. డెర్మల్ పాపిలా మనుషుల చర్మంలో ఉంటుంది. జట్టు ఎదుగుదల, మందం, పొడవు దీని గ్రోత్ పైనే ఆధారపడి ఉంటాయి. సైంటిస్టులు పరిశోధనకు తీసుకున్న డెర్మల్ పాపిలా కణాలను పిండంలోని ప్లూరీ పొటెంట్ కణాల (మూల కణాలు) నుంచి సేకరించారు.