మీ వెంట్రుకలు తెగ రాలిపోతూ బట్టతల వచ్చేసిందా..? అస్సలు ఫీలవ్వకండి.. ఎందుకంటే..

మీ వెంట్రుకలు తెగ రాలిపోతూ బట్టతల వచ్చేసిందా..? అస్సలు ఫీలవ్వకండి.. ఎందుకంటే..

రోజూ కనీసం రెండు పెగ్గులు పడనిదే మీకు నిద్ర పట్టడంలేదా? ఎంత ట్రై చేసినా స్మోకింగ్ మానలేకపోతున్నరా? ఎవరన్నా కొంచెం రెచ్చగొడితే చాలు.. వెంటనే కొట్లాటకు దిగుతున్నరా? బారెడు పొద్దెక్కినా మంచం దిగబుద్ధి అయితలేదా? తక్కువే  తింటున్నా బొజ్జ గణపయ్యలా తయారవుతున్నరా? పొట్టి బుడంకాయ.. బట్టతలకాయ అని ఎవరైనా ఏడిపిస్తున్నరా? అయితే, అస్సలు ఫీలవ్వకండి. ఆ నేరం మీది కాదు..  ఆ నేరం మీ డీఎన్ఏ పోగుల్లో ఉన్న జీన్స్దని చెప్పండి! అవును. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అని కన్యాశుల్కం నాటకంలో అగ్నిహోత్రావధానుల చేత అమాయకంగా చెప్పించిండు అప్పట్లో గురజాడ.  కానీ, ఇప్పుడు వేదాల ముచ్చట పక్కనపెడితే.. ‘అన్నీ జీన్స్ లోనే ఉన్నాయష’ అంటున్నరు సైంటిస్టులు!  మనుషుల రూపురేఖలు, హెల్త్ నుంచి మొదలుకుని అలవాట్లు, బిహేవియర్ దాకా అన్నింటికీ జీన్సే కారణమని చెప్తున్నరు. 

మన డీఎన్ఏలోని 600కుపైగా జన్యువుల్లో జరిగే మ్యుటేషన్ల వల్లే రకరకాల క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని స్పెయిన్ లోని బార్సిలోనా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైంటిస్టులు ఇటీవల తేల్చిన్రు. సికిల్ సెల్ ఎనీమియా (కొడవలి కణ రక్తహీనత) జన్యు వ్యాధి బారినపడిన ఓ యువకుడికి జీన్ ఎడిటింగ్ ద్వారా అమెరికన్ డాక్టర్లు  సక్సెస్ ఫుల్​గా ట్రీట్మెంట్ చేసిన్రు.  నియాండెర్తల్స్ మానవుల నుంచి వారసత్వంగా వచ్చిన ‘హెచ్ఎస్3ఎస్ టీ3ఏ1’ జన్యువే మన దంతాల ఆకారాన్ని నిర్ణయిస్తోందని యూనివర్సిటీ కాలేజ్ లండన్ సైంటిస్టుల స్టడీలో తేలింది. మొత్తంగా.. మనుషుల గుట్టంతా జన్యువుల్లోనే ఉందన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ఇటీవలి స్టడీలను గమనిస్తే.. మనుషుల సైకాలజీ,  బిహేవియర్ పై జన్యువుల ప్రభావం అనుకున్నదాని కంటే ఎక్కువే ఉంటుందని తేటతెల్లం అవుతున్నది.  

లేజీ ఫెలో అని తిడుతున్నరా.. నింద జీన్స్​పైకి తోసేయండి
కొంతమంది బారెడు పొద్దెక్కినా మంచం దిగరు. ఏ పని చేసుకోవాలన్నా బద్ధకంగా కదుల్తరు. చివరకు ఇంటా బయటా లేజీ ఫెలో అని తిట్లు తింటరు. అయితే మనుషుల్లో చురుకుదనానికి, మోటివేషన్ లెవెల్స్​కు ‘బీడీఎన్ఎఫ్’ అనే జన్యువే కారణమట! అందుకే ఈసారి ఆఫీసులో బాస్ తిడితే గనక.. తప్పు మీది కాదు, మీ జీన్స్​దని చెప్పండి! అంతేకాదు.. మనకు ఎంత నిద్ర సరిపోతుందన్నది కూడా జీన్స్ మీదే ఆధారపడి ఉంటుందట. ‘డీఈసీ2’ అనే జన్యువులో మ్యుటేషన్స్ జరిగిన వ్యక్తులు తక్కువసేపు నిద్రపోయినా హుషారుగానే ఉంటారట!  

ఎవరిని లవ్ చేయాలన్నదీ ఇదే డిసైడ్ చేస్తది
మీరు ఎవరిని లవ్ చేయాలన్న విషయాన్ని కూడా జీన్సే డిసైడ్ చేస్తయంటున్నరు సైంటిస్టులు.  అవును. ఒకే రకమైన ‘ఇమ్యూన్ సిస్టం జీన్స్ (హెచ్ఎల్ఏ జీన్స్)’ ఉన్న వ్యక్తులు పరస్పరం అట్రాక్ట్ అవుతారని పరిశోధనల్లో తేలింది మరి! అందుకే కొందరు అంటుంటరు కావచ్చు.. ‘మా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని’! అట్లనే.. కొందరు చిన్న చిన్న కారణాలకే ఇతరులతో కొట్లాటలకు దిగుతుంటరు. వారిలో ముక్కోపానికి కారణం ‘వారియర్ జీన్ (ఎంఏఓఏ)’ కావచ్చని అంటున్నరు. ‘ఓఎక్స్ టీఆర్’ అనే జీన్ లో వేరియేషన్స్ వల్ల మనుషుల్లో క్రూర స్వభావం ఏర్పడుతుందని అంటున్నరు.

రోగాలను ఎదుర్కొనే శక్తికీ ఇవే కారణం 
మన శరీరంలో ఇన్ఫెక్షన్లపై పోరాడటంలో ఇమ్యూన్ సిస్టంకు ‘హెచ్ఎల్ఏ’ జీన్స్ కూడా సాయం చేస్తాయట. ఈ జీన్స్ బాగా పని చేసేవాళ్లలో రోగాలను తట్టుకునే శక్తి సహజంగానే ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు..‘సీసీఆర్5’ అనే జన్యువులో మ్యుటేషన్లు జరిగిన వాళ్లలో హెచ్ఐవీని నిర్మూలించే శక్తి ఉంటుందని తేలింది!  ‘9పీ21’ వంటి జీన్స్​కు, హార్ట్ ఎటాక్ ముప్పుకూ గట్టి లింక్ ఉందని పరిశోధనల్లో తేలింది! అంతేకాదు.. క్యాన్సర్లకు కారణమయ్యే జీన్స్ ఆరు వందల వరకూ ఉన్నాయని కనుగొన్నారు. 

'చీటింగ్, దొంగ' జీన్సూ ఉన్నయ్!
కొందరు నమ్మినవాళ్లను, జీవిత భాగస్వాములను సైతం మోసం చేసి, నట్టేట ముంచిపోతుంటరు. మరికొందరు చాన్స్ దొరికితే చాలు చేతివాటం ప్రదర్శిస్తుంటరు. అయితే ‘డీఆర్ డీ4’ అనే జీన్​కూ, ఇలాంటి చెడు ప్రవర్తనకూ లింక్ ఉందట. అయినా సరే మీరు మాత్రం చీటింగ్ చేసేసి తప్పు ఈ జీన్ మీదకైతే తోసేయకండి!  ఎందుకంటే జీన్ ప్రభావం కొంత ఉండొచ్చేమో. కానీ, మీ తప్పులకు  కర్త, కర్మ, క్రియ మాత్రం మీరే అన్నది మరువకండి!

బట్టతల పాపమూ జన్యువులదే!
మీ వెంట్రుకలు వేగంగా రాలిపోతూ బట్టతల వచ్చేస్తుంటే అందుకు ‘ఎఆర్ (ఆండ్రోజన్ రిసెప్టార్)’ జీన్ కారణం కావచ్చని సైంటిస్టులు చెప్తున్నరు!  అట్లనే.. మిగతా జంతువులకు భిన్నంగా మనుషులు మాత్రమే మాట్లాడటానికి ‘నోవా1’ అనే జీన్ కారణమట. ‘ఏసీటీఎన్3’ అనే జీన్ ఉన్నోళ్లకు పెద్దగా చలి పెట్టదట. ‘రోబో1’, ‘డీసీడీసీ2’ అనే జీన్స్ వల్లే కొందరికి లెక్కల్లో మంచి పట్టు ఏర్పడుతుందట.  ఇగ ‘ఎంసీ4ఆర్’ అనే జీన్ వల్లే కొందరు జంక్ ఫుడ్​కు అట్రాక్ట్  అవుతున్నరట.  మీరు 90 ఏండ్లు పైబడి బతకాలంటే ‘ఎఫ్ఓఎక్స్ఓ3’ జన్యువు,  ‘ఎస్వీఆర్ టీ1’ అనే ప్రోటీన్​ కూడా దయ చూపించాల్సిందేనట.  అంతేకాదు.. వ్యాపారంలో రాణించాలంటే ‘ఎంట్రప్రెన్యూర్ జీన్’, లీడర్​గా ఎదగాలంటే ‘ఆర్ఎస్4950’ జీన్ ఉండాల్సిందేనని సైంటిస్టులు అంటున్నరు.  

జీన్స్ను ఎడిట్ చేయొచ్చు కానీ..
మనుషుల్లో జీన్ మ్యుటేషన్ల వల్లే అనేక వ్యాధులు వస్తున్నయి. అందుకే జన్యువులను ఎడిట్ చేయడం ద్వారా ఈ రోగాలకు చెక్ పెట్టే పనిలో సైంటిస్టులు ఎప్పటినుంచో బిజీగా ఉన్నరు.‌ జీన్ ఎడిటింగ్ కోసం కనిపెట్టిన క్రిస్ప్ఆర్ టెక్నాలజీ ఇప్పటికే వచ్చేసింది. దీనితో సికిల్ సెల్ ఎనీమియాకు  సైంటిస్టులు చెక్ పెట్టేశారు కూడా! ఇదేదో బాగున్నట్టుందే.. జీన్స్ ఎడిట్ చేసేసి పిల్లలను కూడా మనకు కావల్సినట్టుగా మంచి రూపురేఖలు, శరీర దారుఢ్యం, తెలివితేటలు ఉండేలా డిజైన్ చేసుకుంటే పోలా.. అనిపిస్తోంది కదూ.. సైంటిస్టులు కూడా అదే పనిలో ఉన్నారులెండి! జెనెటిక్ ఇంజనీరింగ్​తో డిజైనర్ బేబీల సృష్టికి ప్రయత్నాలు జరుగుతున్నయి. కాకపోతే.. అది ఇప్పట్లో అయ్యే పని కాదు. ఒకవేళ అయినా.. నైతికపరమైన అనేక సందేహాలు వస్తాయంటున్నరు. 

షరతులు వర్తిస్తయ్!
‘అన్నీ జీన్స్​లోనే ఉన్నాయష’ అని.. ఇగ ఏం చేసినా నేరం మనది కాదని... తప్పుల మీద తప్పులైతే మీరు చేయకండి! ఎందుకంటే.. అన్నింటికీ జీన్సే కారణం అయినప్పటికీ ఎపిజెనెటిక్స్ అనే మరో శాస్త్రం మాత్రం ఇందుకు అస్సలు ఒప్పుకోదు! జీన్స్ ఆన్ లేదా ఆఫ్ అయ్యేందుకు పరిసరాల ప్రభావం కూడా గణనీయంగానే ఉంటుందని ఈ సైన్స్ విభాగం స్పష్టం చేస్తోంది. అంటే, మనుషులు పెరిగిన వాతావరణం, ఎదురయ్యే సంఘటనలు, చుట్టూ ఉండే వ్యక్తులు, లైఫ్ స్టైల్, ఫుడ్ వంటివీ అత్యంత కీలకం అని.. ఇవన్నీ బాగుంటే జీన్స్ నెగెటివ్ ఎఫెక్ట్  చాలావరకు రివర్స్ కూడా అవుతుందని అంటున్నరు ఎపిజెనెటిసిస్టులు.  సో.. కేవలం సరదాకు మాత్రమే మన తప్పులను జీన్స్ పైకి తోసేసి, వాటిని బ్లేమ్ చేయాలన్నమాట!

మందుబాబులు, పొగరాయుళ్లూ.. మీకూ ఉన్నయ్ సాకులు!
కొంతమంది రోజూ పీకలదాకా తాగి ఊగుతుంటరు. మరికొందరు కట్టలకొద్దీ బీడీలు, డబ్బాల కొద్దీ సిగరెట్లు ఊది పారేస్తుంటరు. హెల్త్  కరాబ్ అని తెలిసినా ఈ అలవాట్లు అంత ఈజీగా వదిలిపోవు. అయితే ‘సీహెచ్ఆర్ఎన్ఏ5’ అనే జన్యువు నికోటిన్ అడిక్షన్​కు కారణమైతే.. ‘ఏడీహెచ్1బీ’ అనే జన్యువు ఆల్కహాల్ అడిక్షన్​కు కారణమని చెప్తున్నరు!  సో.. మీరు కూడా వీటిని మానలేకపోతే గనక.. నేరం మీది కాదు మీ జన్యువులదని సాకులు చెప్పుకోండి! అట్లనే కాఫీ, టీలు విపరీతంగా తాగడానికి, ‘సీవైపీ1ఏ2’అనే జన్యుకు కూడా లింక్ ఉంటుందని చెప్తున్నరు.

హన్మిరెడ్డి యెద్దుల, సీనియర్​ జర్నలిస్ట్​