బాల్క సుమన్‌కు ప్రతి పనిలో 30 శాతం కమీషన్ : వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు : చెన్నూరు నియోజకవర్గంలో చేసిన ప్రతి పనిలో 30 శాతం కమీషన్‌ను ఎమ్మెల్యే బాల్క సుమన్ తీసుకున్నాడని మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఇసుక దందాతో రూ.వెయ్యి కోట్లు దోచుకున్నాడని మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను, స్థానిక సమస్యలను పట్టించుకోకుండా ఐదేండ్లుగా ప్రగతిభవన్‌కే పరిమితం అయ్యాడని విమర్శించారు. బుధవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని శెట్ పల్లి, నర్సింగాపూర్, బెజ్జాల, మద్దులపల్లి, కుందారం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి ప్రచారం చేశారు. మందమర్రిలోని ఐఎన్టీయూసీ ఆఫీస్, రెండో జోన్ ఏరియాలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్​వెంకటస్వామి మాట్లాడుతూ.. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌‌తో పంటలు మునిగి రైతులు ఎంతో నష్టపోతున్నారని చెప్పారు. గోదావరి ప్రాంతంలో కరకట్ట నిర్మించాలనే కనీస సోయి ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు లేదన్నారు. ఓట్ల కోసం ఆగమేఘాల మీద చెన్నూరులో హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి హరీశ్​రావు ఇప్పటివరకు డాక్టర్లను నియమించలేదని విమర్శించారు.

200 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినయ్

రాజకీయాల్లోకి రాక ముందు ఎకరం భూమి లేని బాల్క సుమన్‌కు 200 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని వివేక్ ప్రశ్నించారు. పదవిని అడ్డం పెట్టుకుని అక్రమంగా వెయ్యి కోట్లు సంపాదించుకున్నాడని, ఆ సొమ్ముతోనే ఒక్కో ఓటును రూ.5 వేలు పెట్టి కొంటానంటున్నాడని  ఆరోపించారు. గత ఐదేండ్లలో ప్రతి పనికి 30 శాతం కమీషన్​తీసుకున్నాడని, దళితబంధులోనూ 30 శాతం కమీషన్ పొందాడన్నారు. ఓట్ల కోసం ఇస్తానంటున్న రూ.5 వేలలోనూ కమీషన్ తీస్కుంటాడేమో అని ఎద్దేవా చేశారు. మైనింగ్, పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి చెన్నూర్ నుంచి రోజుకు 200 లారీల ఇసుకను అక్రమంగా అమ్ముకున్నాడని ఆరోపించారు. స్థానిక సమస్యలపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టించి బెదిరించాడని, జైపూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఫయాజ్, తిరుపతి రాజు, కిరణ్, శ్రీనివాస్​రెడ్డిని ఎంతో ఇబ్బంది పెట్టాడని, అయినా వారు భయపడలేదని చెప్పారు. ప్రజలను పీడిస్తున్న బాల్క సుమన్‌ను గంగ అవతలికి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక జైపూర్​పవర్​ప్లాంట్​లో స్థానికులకే ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్​హయంలోనే ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, ప్రస్తుత జడ్పీటీసీ, బీఆర్ఎస్​లీడర్​ఇల్లు కూడా అదేనన్నారు. గోదావరి ఒడ్డున ఘాట్ కట్టిస్తానని, బెజ్జల నుంచి గోదారి వరకు గంగా రోడ్ వేయిస్తానని, నర్సింగాపూర్​లో నాలుగు లైన్ల రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అతిపెద్ద అవినీతిపరుడు కేసీఆరే

రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం పనులను కేసీఆర్​కమీషన్ల కోసం ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టాడని వివేక్​వెంకటస్వామి మండిపడ్డారు. ఇక్కడి వారి నోట్లో మన్నుకొట్టాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గంగలో కలిసిందని, తెలంగాణలో అతిపెద్ద అవినీతిపరుడు కేసీఆరే నని విమర్శించారు. సొంతూరులో ప్రతి ఇంటికి రూ.10 లక్షలు ఇచ్చిన కేసీఆర్.. చెన్నూరులో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సింగరేణి సంస్థను ఎలా దోచుకోవాలా? అని కేసీఆర్ చూస్తున్నాడని చెప్పారు. కేసీఆర్‌‌వి దోకేబాజ్ మాటలని.. రైతులను కోటీశ్వరులను చేస్తానని నమ్మించి మోసం చేశాడన్నారు. సీఎం కాక ముందు పది ఎకరాలు ఉండగా, ఇప్పుడు వెయ్యి ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్​ఫ్యామిలీ కాళేశ్వరంలో కమీషన్, లిక్కర్​దందాతోపాటు హైదారాబాద్​చుట్టూ 25 వేల ఎకరాల భూములను దక్కించుకుందన్నారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించింది కాకా వెంకట స్వామి అని గుర్తు చేశారు.

ఊరూరా ఘన స్వాగతం

జైపూర్ మండలంలోని శెట్​పల్లి, బెజ్జాల, నర్సింగాపూర్, మద్దులపల్లి, కుందారం గ్రామాల్లో పర్యటించిన వివేక్​వెంకటస్వామికి ఊరూరా డప్పుచప్పుళ్లు, పూలదండలు, మంగళహారతులతో ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్​పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజలకు వివేక్ వివరించారు. కేసీఆర్‌‌ను గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను ఆయా గ్రామాల ప్రజలు ఆయనకు చెప్పుకున్నారు. బాల్క సుమన్ కు వచ్చే ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్తామని చెప్పారు. వివేక్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.