
- డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమాయె.. మందమర్రిలో కేసీఆర్ పార్కు ఎటు పాయె?
- పెద్దపల్లి, చెన్నూరు అభివృద్ధికి కాకా ఫ్యామిలీ ఎంతో చేసిందన్న నేతలు
మందమర్రి, వెలుగు: పెద్దపల్లి పార్లమెంటు, చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కేంద్ర మాజీ మంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి, ఆయన కొడుకులు అందించిన సేవలపై అవగాహన, సోయి లేకుండా ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతున్నారని బీజేపీ మందమర్రి టౌన్ ప్రెసిడెంట్ మద్ది శంకర్, జిల్లా జనరల్ సెక్రటరీ అందుగుల శ్రీనివాస్ మండిపడ్డారు. ఎంపీగా పని చేసి, చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న బాల్క సుమన్.. నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని అన్నారు. కాకా ఫ్యామిలీపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. శుక్రవారం మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో బీజేపీ నేతలు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తన నాన్న అని చెప్పుకున్న బాల్క సుమన్ మందమర్రిలో కేసీఆర్ పార్కును ఎందుకు పూర్తి చేయలేదని, కేసీఆర్‌పై ప్రేమ తగ్గిందా అని ఎద్దేవా చేశారు. గెలవగానే మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపిస్తానని కేసీఆర్‌తో పాటు సుమన్ హామీ ఇచ్చారని, ఇప్పుడు సోయిలేకుండా కేంద్రం పరిధిలో ఉందని దాటవేశారన్నారు. నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయలేదని, ఎంపీగా ఉన్నప్పుడు క్యాతన్‌పల్లిలో ఇంటర్నేషనల్ స్థాయి స్టేడియం కోసం రూ. 50 కోట్లు మంజూరు చేశానని చెప్పుకున్న సుమన్ ఇప్పుడు స్టేడియం, ఫండ్స్ ఎటెళ్లాయో చెప్పాలని నిలదీశారు. సింగరేణి ప్రాంతాల్లో అందరికీ పట్టాలు, మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్మార్కెట్లు, మందమర్రి, క్యాతన్‌పల్లిలో సెంట్రల్‌లైటింగ్, అంబేద్కర్ స్టడీ సర్కిల్, మందమర్రిలో క్లాక్ టవర్ కనిపించడంలేదన్నారు.
32 ఏండ్లుగా ప్రజా సేవలో..
కాకా ఫ్యామిలీ 32 ఏండ్లుగా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోందని.. 22 సంవత్సరాలుగా విశాక చారిటబుల్ ట్రస్ట్, కాకా ఫౌండేషన్ ద్వారా స్కూల్ బిల్డింగ్‌లు, బెంచీలు, బోర్‌వెల్స్, వాటర్ ట్యాంకులు, బస్ షెల్టర్లు, సోలార్ తోపుడు బండ్లు, ట్రైనింగ్ క్యాంపులు, కరోనా టైమ్‌లో వేలాది కుటుంబాలకు నిత్యావసరాలు అందించారని, ఆర్థిక సాయం చేశారని బీజేపీ లీడర్లు అన్నారు. కేవలం డ్రై ప్రూట్స్ పంచి గొప్పలు చెప్పుకున్న బాల్క సుమన్‌కు ఇక్కడి ప్రజల బాగోగులు తెలియవన్నారు. సింగరేణి ఎంప్లాయీస్‌కు పెన్షన్ విధానం తీసుకొచ్చిన ఘనత కాకాకు దక్కుతుందన్నారు. సింగరేణి బీఎఫ్‌ఐఆర్‌లోకి వెళ్తే రూ. 400 కోట్లను ఎన్టీపీసీ నుంచి ఇప్పించి సింగరేణి సంస్థ, లక్ష మంది ఉద్యోగాలకు భరోసా కల్పించారని, మంచిర్యాలలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేశారన్నారు. జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల సింగరేణి పవర్ ప్లాంట్ కాకా చొరవతోనే వచ్చిందన్నారు. క్యాతన్ పల్లి రైల్వే గేటు దగ్గర రామకృష్ణాపూర్ ప్రజల ఇబ్బంది చూసి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి రూ. 32 కోట్లను వివేక్ వెంకటస్వామి మంజూరు చేయించారన్నారు. ఫండ్స్ తేకున్నా శిలాఫలకం వేసుకున్న బాల్క సుమన్.. 6 నెలల్లో పనులు పూర్తి చేయిస్తానని చెప్పి రెండేళ్లయినా ఆర్‌వోబీ పూర్తి చేయించలేకపోయారన్నారు. రామగుండంలో మూతబడ్డ ఎరువుల ఫ్యాక్టరీ రీ ఓపెన్‌కు వివేక్ కారణమని సీఎం, మంత్రి హరీశ్ చెప్పిన విషయం సుమన్‌కు కనిపించట్లేదా అని నిలదీశారు. మీటింగ్‌లో బీజేపీ రూరల్ ప్రెసిడెంట్ పైడిమల్ల నర్సింగ్, సీనియర్ నేత డి.వి. దీక్షితులు పాల్గొన్నారు.