బాల్క్ సుమన్ ను ప్రశ్నిస్తే కేసులు, దాడులు : అయిదేండ్లలో చెన్నూరులో లెక్కలేనన్ని ఘటనలు

వెలుగు, చెన్నూర్:  ఎమ్మెల్యే బాల్కసుమన్, ఆయన అనుచరుల అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేయడం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టి పోలీసులతో వేధించడం.. గడిచిన ఐదేండ్లుగా చెన్నూర్ నియోజకవర్గంలోని పరిస్థితి ఇదీ! సుమన్ , అతని గ్యాంగ్​ చేసే అరాచకాలతో చెన్నూర్ ప్రజలు, ప్రతిపక్షాల లీడర్లు, కార్యకర్తలు బెంబేలెత్తిపోతున్నారు. చెన్నూర్​లో ‘సోషల్​ మీడియా వారియర్స్​’ పేరిట బాల్క సుమన్  ఓ ప్రైవేట్​ సైన్యాన్ని తయారు చేసుకుని చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. మాట వినకుంటే  బెదిరించడం, పోలీసులను ప్రయోగించడం పరిపాటిగా మారింది. కోటపల్లి మండలం బబ్బెరచెల్కకు  చెందిన ఆసంపల్లి మహేశ్​ అనే యువకుడు ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్నాడు. 

బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఓయూ జేఏసీ లీడర్లు వస్తున్నారనే సమాచారాన్ని అప్పటి బీజేపీ టౌన్  ప్రెసిడెంట్  సుద్దపల్లి సుశీల్ కుమార్  సోషల్  మీడియాలో పోస్ట్​ చేశారు. వారిని అడ్డుకునేందుకు మున్సిపల్  చైర్ పర్సన్  భర్త రామ్ లాల్​ గిల్డా, వైస్  చైర్మన్  నవాజుద్దీన్,  మంత్రి బాపు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ​కౌన్సిలర్లు, వందమందికి పైగా కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్ వద్ద మకాం వేశారు. చేతుల్లో కర్రలు పట్టుకొని తిరుగుతూ వచ్చిపోయే వెహికిల్స్ ను చెక్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.  ఇదే సమయంలో పట్టణంలో ఒక  కార్యక్రమానికి వెళ్లేందుకు బీజేపీ లీడర్లు సుద్దపల్లి సుశీల్ కుమార్  ఇంటిదగ్గరకు వచ్చారు. బీఆర్​ఎస్​ లీడర్లు వారిని బూతులు తిడుతూ దాడికి యత్నించారు. పోలీసులు దాడికి యత్నించిన బీఆర్​ఎస్​ లీడర్లను వదిలేసి బీజేపీ లీడర్లను అదుపులోకి తీసుకుని పోలీస్​స్టేషన్​లో నిర్బంధించడం అప్పట్లో కలకలం రేపింది..  

ప్రతిపక్ష లీడర్లపై దాడి... 

చెన్నూర్​ శివారులో తెగుళ్లతో పంట నష్టపోయిన మిర్చి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన ప్రతిపక్ష లీడర్లపై మున్సిపల్ చైర్ పర్సన్ భర్త రాంలాల్ గిల్డా నేతృత్వంలో సుమారు వంద మంది బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇసుప రాడ్లు, కర్రలతో లీడర్లపై విచక్షణారహితంగా దాడి చేయడంతో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, నగునూరి వెంకటేశ్వర్లుగౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. అందుగుల కారు అద్దాలు  ధ్వంసం అయ్యాయి.  

ఎదురుగా ఎమ్మెల్యే ఉన్నడు... ఎవరొస్తరో రండి... 

కోటపల్లి మండలంలోని లక్ష్మీపూర్ శివారులో నిజామాబాద్​ – జగ్డల్​పూర్​ హైవే 63 పక్కన ఆ మండల వైస్​ ఎంపీపీ వాలా శ్రీనివాస్​రావు తన అనుచరుడితో దాబా నడుపుతున్నాడు. చెన్నూర్​, కోటపల్లి మండలాల్లోని వైన్స్​ నుంచి లిక్కర్​ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు. పగలు రాత్రి బార్​ను తలపించేలా సిట్టింగులు పెడుతున్నాడు. గతంలో దాబాలో ఎమ్మెల్యే బాల్క సుమన్​, వాలా శ్రీనివాస్​రావు ఫొటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. దీంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడానికే జంకుతున్నారు. చాలా రోజుల కింద మీడియాలో వార్తలు రావడంతో ఫెక్సీని తొలగించినప్పటికీ సిట్టింగ్​ మాత్రం యథావిధిగా నడుస్తోంది. 

జర్నలిస్టులపై అక్కసు..

ప్రభుత్వ విధానాలు, పథకాలు, లోపాలపై వార్తలు రాసినా బాల్క సుమన్​ జీర్ణించుకోవడం లేదు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులను ఆయన అనుచరులు బెదిరిస్తున్నారు. ఇటీవల మందమర్రిలో జర్నలిస్టులను వాడు వీడు అంటూ వంకర రాతలు రాసేవాళ్లను సక్కగ చేయాలంటూ దాడులకు పురికొల్పారు. సుమన్ తీరుపై జర్నలిస్టులు భగ్గుమన్నారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల వేళ బెదిరింపులకు గురిచేయడంపై ఎలక్షన్  కమిషన్ కు ఫిర్యాదు చేశారు.


2021 జూన్ లో అప్పటి చెన్నూర్ బీజేపీ టౌన్  ప్రెసిడెంట్ సుద్దపల్లి సుశీల్ కుమార్ సోషల్ మీడియాలో సుమన్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని బీఆర్ఎస్  లీడర్ దోమకొండ అనిల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. పోలీసులు సుశీల్ పై క్రైమ్ నంబర్ 95/2021 అండర్ సెక్షన్ 341, 504(1)(బీ)(పీ)(2), 506, 290 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సామాన్యుల విషయంలో ఏమాత్రం స్పందించని పోలీసులు అనిల్​ కంప్లైంట్ పై అత్యుత్సాహం చూపారు. ఓ టెర్రరిస్టునో, నక్సలైట్ నో పట్టుకున్నంత సీన్  క్రియేట్  చేశారు. సుశీల్ కుమార్ బీడీ లీఫ్  కాంట్రాక్టు పనుల కోసం భద్రాచలం దగ్గర ఒక గ్రామానికి వెళ్తే అక్కడికి స్పెషల్  టీమ్ ను పంపించి 2021మే 15న అర్ధరాత్రి ఆయనను అదుపులోకి తీసుకొని చెన్నూర్​కు తరలించారు. సుశీల్​ను వివిధ పోలీస్ స్టేషన్లలో తిప్పుతూ టెన్షన్ క్రియేట్ చేశారు. చివరకు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్  వెంకటస్వామి, అప్పటి బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్  పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. దీంతో జైపూర్  ఏసీపీ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి స్టేషన్ బెయిల్ పై సుశీల్ ను రిలీజ్  చేశారు.

మందమర్రికి చెందిన హైకోర్టు లాయర్ , బీఎస్పీ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ఎంవీ.గుణ మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ ఎస్  లీడర్లు చేస్తున్న భూకబ్జాలు, రియల్ ఎస్టేట్ దందాలపై సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఆయనను చంపేస్తామని సుమన్ అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై ఆయన రామగుండం పోలీస్ కమిషనర్​కు కంప్లైంట్ చేశారు. దీంతో వారు మరింత రెచ్చిపోయి మందమర్రి, రామకృష్ణాపూర్  పోలీస్  స్టేషన్లలో గుణపై 505 ఐసీసీ సెక్షన్ కింద మూడు కేసులు నమోదు చేయించారు. 

విద్యుత్​ ఉద్యోగులపై దాడి... 

చెన్నూర్​లో మెయిన్​ రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోయిన వారికి విద్యుత్​ సబ్​ స్టేషన్​ వద్ద షెడ్ల నిర్మాణానికి పూనుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం లేదని అక్కడి ఉద్యోగులు ముగ్గుపోయడాన్ని అడ్డుకోవడంతో వారిపై బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు దాడికి పాల్పడ్డారు. పైగా తమపైనే దాడి చేశారంటూ బాధితులపైనే అట్రాసిటీ కేసు పెట్టారు. దీనికి నిరసనగా విద్యుత్​ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మూడ్రోజులు విధులు బహిష్కరించి ఆందోళన చేశారు.

రెచ్చగొట్టే మాటలు.... 

    సీఎం కేసీఆర్ పై, బీఆర్ ఎస్ పై ఎవరైనా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోవద్దు. వాళ్లను మీరు ఏమైనా చేయండి. ఆ నా కొడుకులను తన్ని తరిమేయండి. నేను చూసుకుంటా.
    ఇంట్లో గోడకు తుపాకీ వేలాడదీసిన. దాంట్ల బుల్లెట్లు నింపి ఉన్నయ్​. అవసరమొచ్చినప్పుడు ఆ తుపాకీ బయటకు తీసి పేలుస్తా.  
    వాడొకడు వీడొకడు వంకర రాతలు రాస్తున్నరు. అట్ల వంకర వార్తలు రాసేటోళ్లను మీరు సక్కగ చేయాలె. (జర్నలిస్టులను ఉద్దేశించి) 
    లం... కొడుకులు సూట్​కేసులకు అమ్ముడు పోయిన్రు. ఎవడెవడు ఎంతెంతకు అమ్ముడు పోయిండో బట్టలిప్పి బజారున పెట్టుర్రి. 30 తారీఖు దాకా ప్రజల్లో  చర్చ పెట్టుర్రి. 30 తర్వాత నా చర్య మీరు చూస్తరు వివిధ సందర్భాల్లో బాల్క సుమన్​

మావోయిస్టుల వార్నింగ్..

ఎమ్మెల్యే బాల్క సుమన్  ఇసుక మాఫియాకు అండగా నిలిచి కోట్లకు పడగలెత్తాడని, ఆయన అనుచరులు చెన్నూర్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీల భూములను కబ్జా చేయడమే కాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మావోయిస్టు పార్టీ కోల్  బెల్ట్ ఏరియా కమిటీ సెక్రటరీ ప్రభాత్  బహిరంగ లేఖలో పేర్కొన్నారు. సుమన్, ఆయన అనుచరులు తమ పద్ధతి మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. 

2023 ఫిబ్రవరి 24న చెన్నూర్​ మండలం సుద్దాల గ్రామంలో బీజేపీ స్ట్రీట్​ కార్నర్​ మీటింగ్​పై  బీఆర్​ఎస్​ లీడర్లు దిగారు. నాయకుల ప్రసంగాలకు అడ్డుతగులుతూ వీరంగం సృష్టించారు. కరెంట్​ కట్​ చేసి చీకట్లో కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపించారు. కవరేజీకి వచ్చిన ఓ మీడియా వెహికల్​పై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. గ్రామస్తులు ఎదురుతిరగడంతో అక్కడినుంచి జారుకున్నారు.

ALSO READ :- మంగళవారం మూవీకి రికార్డ్ ఓపెనింగ్స్.. మేకర్స్ కూడా ఊహించివుండరు?