- గాయపడ్డ గణేశ్
- పోలీసులకు ఫిర్యాదు
జైపూర్, వెలుగు : బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో ఎందుకు చేరావంటూ మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలంలోని షెట్పల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తపై ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు దాడి చేశారు. షెట్పల్లికి చెందిన నక్క గణేశ్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్కు చెందిన జైపూర్జడ్పీటీసీ మేడి సునీత భర్త తిరుపతి అనుచరులతో కలిసి సోమవారం రాత్రి షెట్పల్లిలో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నక్క గణేశ్ ఇంట్లోకి చొరబడిన తిరుపతి అనుచరులు సంపత్, భీమయ్య..గణేశ్‌ను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. ఈ ఘటనలో గణేశ్ గాయపడ్డాడు. బాధితుడు గణేశ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు, జడ్పీటీసీ అనుచరులతో తనకు ప్రాణ హాని ఉందన్నాడు. ఎక్కడ కనిపించినా తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయాడు. ఈ దాడిపై కాంగ్రెస్ లీడర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.