నిజామాబాద్, వెలుగు: ఎన్నికలు పూర్తయ్యేదాకా ఈ 30 రోజులు తన గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడితే ప్రజల కోసం ఐదేళ్లు కష్టపడతానని బాల్కొండ బీజేపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు. మంగళ వారం ఆమె ఎర్గట్ల మండలం తడ్పాకల్, బట్టాపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి కనుసన్నల్లో ఆయన అనుచరులు బట్టాపూర్ మైనింగ్ క్వారీ నడిపి భారీగా సంపాదించారన్నారు. క్వారీ అక్రమాలపై తన కొడుకు మల్లిఖార్జన్రెడ్డి హైకోర్టుకు వెళ్లి మూసివేత ఆర్డర్స్ తెచ్చేదాకా సర్కారు కళ్లు మూసుకుందన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే బీఆర్ఎస్లో చేరబోమని హామీ ఇస్తారా అని ప్రశ్నించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన బాధిత రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తోకల నర్సయ్య, మల్కన్నగారి మోహన్, నారాయణరెడ్డి, రమేశ్‌రెడ్డి, రంజిత్ తదితరులు ఉన్నారు. తరువాత మండల కేంద్రంలోని పాండురంగ ఫంక్షన్ హాల్ లో బీజేపీ బూత్‌లెవల్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, పేరాల శేఖర్‌రావు, మల్లిఖార్జున్‌రెడ్డి తదితరులు ఉన్నారు.