క్వింటాల్​ వరికి రూ.500 బోనస్ : ముత్యాల సునీల్ కుమార్

బాల్కొండ, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే క్వింటాల్​వరికి రూ.500 బోనస్ చెల్లిస్తోందని బాల్కొండ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన వేల్పూర్ మండలం అంక్సాపూర్, లక్కోరా, అక్లూర్, మోర్తాడ్ మండలం గాండ్లపేట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్​ మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తమ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ, రూ.మూడు లక్షల వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. పంట పెట్టుబడి సాయం కింద ఏటా రూ.15 వేలు, భూమిలేని రైతు కూలీలకు రూ.12,000 అందిస్తామన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతి మహిళా ఖాతాలో నెలనెలా రూ.2500 జమ చేస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. చేయూత పథకం ద్వారా రూ.4 వేల పెన్షన్ అందిస్తామని ఆయన వివరించారు.

ఆరోగ్య పథకం ద్వారా రూ.10 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో నియోజకవర్గ ప్రజలను నిలువు దోపిడీ చేసిన మంత్రి ప్రశాంత్​రెడ్డి కోట్లు  దండుకున్నారన్నారు. మహిళా సంఘాల ద్వారా పసుపును కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు.ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ ​సీనియర్​ లీడర్లు  కాంగ్రెస్​లో చేరారు.