కాంగ్రెస్ ​రాగానే ఆరు గ్యారంటీలు : ముత్యాల సునీల్ కుమార్

బాల్కొండ, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్​ అవినీతి పాలన ముగిసి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాల్కొండ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. ఆదివారం వేల్పూర్ మండలం అమీనాపూర్, బాల్కొండ మండలం నెహ్రూ నగర్, కమ్మర్ పల్లి మండలం ఆర్ఆర్ నగర్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర ఏండ్ల బీఆర్ఎస్​పాలనలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎంతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

బాల్కొండ ప్రజలను నిలువు దోపిడీ చేశారని మండిపడ్డారు. కాంట్రాక్టుల్లో కమీషన్లతో రూ.వేల కోట్లకు పడగలెత్తారన్నారు. 5 ఏండ్ల కింద నియోజకవర్గానికి వచ్చిన సీఎం కేసీఆర్  మహిళా సంఘాల ద్వారా పసుపు కొనుగోలు చేస్తామని మాయమాటలు చెప్పి, ప్రజలను మోసం చేశారన్నారు. కర్నాటకలో అమలవుతున్న ఐదు గ్యారంటీలపై దుష్ప్రచారం ఆపాలని హితవు పలికారు. ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో లేరన్నారు.

పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, వరి క్వింటాల్​కు రూ.500 బోనస్, పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్నారు. ఈ సారి తనకు అవకాశమిచ్చి గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తానన్నారు. అంతకు ముందు వన్నెల్(బి) గంగపుత్ర సంఘం, వేల్పూర్ అంబేద్కర్ యూత్, నాగంపేట్ బీజేపీ లీడర్లు  భీంగల్ కు చెందిన బీఆర్ఎస్ లీడర్​ఫిరోజ్ కాంగ్రెస్​లో చేరారు.