పిలగాండ్లు..దురాశ దుఃఖానికి చేటు : బల్ల కృష్ణ వేణి

పిలగాండ్లు..దురాశ దుఃఖానికి చేటు : బల్ల కృష్ణ వేణి

రాఘవరావు ఒక పెద్ద భూస్వామి. అతడు 100 ఎకరాల ఆసామి. అతనికి ఉన్న పంట పొలాల్లో పని చేస్తూ వేలమంది బతుకుతున్నారు. రాఘవరావు పిలిస్తే పలికే వ్యక్తి రంగన్న. అతడు రాఘవరావు ఇంటిలో ఉండి అన్ని పనులు చూసుకుంటాడు. బజారులో కూరలు తేవడం, తోట పనులు, పశువుల సంరక్షణ, అన్నీ చేస్తూ ఉంటాడు. రంగన్న చాలా మంచి మనిషి. రంగన్న భార్య గడసరిది. దురాశ ఎక్కువ.

రంగన్నని రోజు పెద్దాయన ఇంటికి కూరలు తెచ్చినప్పుడు ‘‘వారి డబ్బులతో మనకి కూడా కూరలు తేవాలి, నీ జీతం ఎక్కువ పెంచమను’’ అంటూ రోజూ తగాదా పడుతుంది ఆమె.కానీ, రంగన్న ఒక్కరోజు కూడా తన వ్యక్తిత్వాన్ని, మంచి బుద్ధిని పోగొట్టుకోలేదు. రాఘవరావు రంగన్నని బాగా గమనించి, ఇలాంటి మంచి వ్యక్తి, ఇంత నమ్మకమైన వ్యక్తి ఎక్కడ దొరకడు అని మనసులో అనుకుంటాడు.


ఒకరోజు రంగన్నని, అతడి భార్యని పిలిచి మన తోటలో ఒక ఇల్లు కడతాను ఆ ఇంటి పనిని మీరిద్దరూ దగ్గర ఉండి చేయించండి అని పెద్దాయన అన్నారు.
రంగన్న అలాగే బాబు గారు...! అని ఇంటికి వెళ్లి తన భార్యతో ఇల్లు మాట చెప్పాడు. రంగన్న భార్య దగ్గర ఉండి తోటలో ఇల్లు పని ఇద్దరం చేయిద్దాం అని ఒప్పుకుంది.


తోటలో ఇల్లు కట్టడం ప్రారంభించారు ఇంటి పనికి కావాల్సిన డబ్బులు రంగన్నకి ఇచ్చాడు పెద్దాయన. రంగన్న భార్య అన్ని నాణ్యత తక్కువ ఉన్న వస్తువులు తెప్పించి ఇల్లు పని పూర్తి చేసింది. పెద్దాయన ఇచ్చిన డబ్బులు దురాశతో రంగన్న భార్య మిగులుచుకుంది. ఆ విషయం రంగన్నకి మాత్రం తెలియదు.
బాబు గారు,..! ఇల్లు పని పూర్తి అయ్యింది అని చెప్పాడు రంగన్న. 


ఒకరోజు రంగన్నని అతడి భార్యని పిలిచి తోటలో ఇల్లు నీకోసమే కట్టించాను అని రాఘవరావు గారు చెప్పారు.ఒరేయ్ రంగన్న..! మా నౌకరీ అంతా నిస్వార్థ బుద్ధితో చేస్తున్నావురా! నేను ఎంత జీతం ఇస్తే అంతే తీసుకుంటున్నావు. నీలాంటి మంచి వ్యక్తిని నేను ఎప్పుడూ మరువలేను అందుకు సంతోషముతో ఇంటి తాళాలు తీసుకుని ఆనందంగా బతకండి రా అని పెద్దాయన అన్నారు.
రంగన్న భార్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పుడు రంగన్నతో తను చేసిన దురాశ పని గురించి చెప్పింది. ‘‘నాకు తగిన శాస్తి జరిగింది’’ అని బాధపడింది. అందుకే...దురాశ దుఃఖానికి చేటు అని అన్నారని రంగన్న భార్యని గట్టిగా మందలించాడు.