తిరుమలలో ఏం జరుగుతుంది : ఆలయం ఎదుట ఎమ్మెల్యే ఫొటో షూట్.. గంటన్నరపాటు హంగామా

తిరుమలలో ఏం జరుగుతుంది : ఆలయం ఎదుట ఎమ్మెల్యే ఫొటో షూట్.. గంటన్నరపాటు హంగామా

కలియుగ వైకుంఠం తిరుమల విషయంలో ఇటీవల వరుసగా చోటు చేసుకున్న ఘటనలు చూస్తే ఆలయ పవిత్రతపై శ్రీవారి భక్తులకే కాక సమస్త హిందూ సమాజానికి ఆందోళన కలుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డు వివాదం మొదలుకొని.. మొన్నటికి మొన్న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల దగ్గర తొక్కిసలాట వరకు తరచూ తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశాలే అని చెప్పాలి.. తాజాగా తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించే మరో అంశం వెలుగులోకి వచింది.. శ్రీవారి ఆలయం ముందు ఓ ఎమ్మెల్యే గన్ మెన్లతో ఫోటోషూట్ చేస్తూ గంటన్నరపాటు హడావిడి చేయటం కలకలం రేపుతోంది.

శనివారం ( జనవరి 25, 2025 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. వీఐపీ బ్రేక్ దర్శనానికి వచ్చిన బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఆలయం ముందు ఫోటోషూట్ తో హడావిడి చేశారు. అంతే కాదు.. గన్ మెన్లు, ప్రైవేట్ సెక్యూరిటీతో హల్చల్ చేశారు ఎమ్మెల్యే. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే గన్ మెన్లు, ప్రైవేట్ సెక్యూరిటీతో హల్చల్ చేస్తున్నప్పటికీ విజిలెన్స్ అధికారులు పట్టించుకోకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఇంత జరిగిందా..?

తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఎమ్మెల్యే వ్యవహరిస్తోంటే టీటీడీ అధికారులు, విజిలెన్స్ అధికారులు పట్టించుకోకుండా ఏం చేస్తున్నారంటూ  మండిపడుతున్నారు భక్తులు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు శ్రీవారి భక్తులు.