ఎమ్మెల్సీ ఎన్నికలకు ..బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలి

  •     మహబూబాబాద్​ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 

మహబూబాబాద్, వెలుగు:  జిల్లాలో ఈ నెల 27 న నిర్వహించే నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. బుధవారం కలెక్టరేట్​లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్​మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని, రోజువారి నివేదికలు ఎప్పటికప్పుడు పంపాలన్నారు. ఎలక్షన్ కోడ్ అమలయ్యే విధంగా జిల్లా ఆఫీసర్లు తగిన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ ఎం.డేవిడ్, మహబూబాబాద్ ఆర్డీవో ఎల్.అలివేలు, ఎలక్షన్ విభాగం సూపరింటెండెంట్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​

జనగామ అర్బన్, వెలుగు: ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నట్లు జనగామ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ రిజ్వాన్​బాషా షేక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటుహక్కు వినియోగించుకునేందుకు 27 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జనగామ జిల్లాలో జనగామ, స్టేషన్​ఘనపూర్ డివిజన్లు ఉండగా, జనగామ డివిజన్​లో 9341 మేల్ ఓటర్లు, 5544 ఫీమేల్ ఓటర్లు, ఇతరులు ఒక్కరు ఉండగా, మొత్తంగా 14,886 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. స్టేషన్​ఘనపూర్ డివిజన్​లో 5574 మేల్ ఓటర్లు, 2959 ఫీమేల్ ఓటర్లు, మొత్తంగా 8533 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 23,419 మంది గ్రాడ్యుయేట్లు ఉండగా, ఇందులో దివ్యాంగులు 725 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వెబ్​సైట్​ ద్వారా ఎమ్మెల్సీ ఓటు వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.