హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కారు సిద్ధమైంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. ప్రకటన ఎప్పుడు వచ్చినా ఎన్నికలకు రెడీగా ఉండాలని ఆదేశించారు. దీంతో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. క్షేత్రస్థాయిలో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్ లేదా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏది ముందు నిర్వహించినా.. ఏర్పాట్లలో లోటు లేకుండా చూడాలని ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు ఎన్నికలకు అవసరమైన సామగ్రి, సిబ్బందిని సిద్ధం చేశారు.
కాగా, జీహెచ్ఎంసీ, ఇతర నగరపాలక సంస్థలు, పురపాలికల్లో విలీమైన గ్రామాలు, వాటి పరిధిలోని వార్డులను వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి మినహాయించాలని ఇటీవల ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల వారీగా ఓటరు లిస్ట్, పోలింగ్ కేంద్రాలు, బూత్‌లను తొలగించి ఓటర్ జాబితా నుంచి మినహాయించాలని సూచించింది. అనంతరం మిగిలిన ఓటర్లతో అనుబంధ జాబితాను ఈ నెల 6వ తేదీలోపు ప్రచురించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఆ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది.
బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలు రెడీ..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1.99 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. 12,845 గ్రామ పంచాయతీలు, 1,13,328 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మైసూరు పేయింట్స్ అండ్ వార్నిష్కు చెందిన కంపెనీ నుంచి ప్రభుత్వం బ్యాలెట్‌కు అవసరమైన పేపర్‌ను ఆర్డర్ ఇచ్చి రాష్ట్రానికి తెచ్చింది. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 58 వేలకు పైగా పోలింగ్ బాక్స్‌లను అందుబాటులోకి తేగా.. అదనంగా కర్నాటక, ఏపీ నుంచి 18 వేల బాక్సులు తెప్పించారు.
తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు..
గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి జీపీలు, వార్డులు పెరగనున్నాయి. గతంలో 12,769 పంచాయతీలకు, 1,13,314 వార్డులకు ఎన్నికలు జరగగా.. ఈ సారి 12,845 జీపీలు, 1,13,328 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, ఈ సారి ఎంపీటీసీ స్థానాలు భారీగా తగ్గనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 147 గ్రామాలు జీహెచ్ఎంసీ, నగరపాలక సంస్థలు, మున్సిపాల్టీల్లో కలవడంతో దీని ప్రభావం ఎంపీటీసీ స్థానాలపై పడనున్నది. ప్రస్తుతం 5,857 ఎంపీటీసీలు ఉండగా.. విలీన గ్రామపంచాయతీలను లిస్ట్‌నుంచి తొలగించిన తర్వాత దాదాపుగా 150 నుంచి 250 ఎంపీటీసీ స్థానాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నేడు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వివరాలు పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాగా, రాష్ట్రంలో పాతవి 539 ఎంపీపీలు, జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. ఈ సారి 570 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు అందుబాటులోకి వచ్చాయి. అంటే గతంతో పోలిస్తే ఎంపీటీసీ స్థానాలు తగ్గనుండగా.. ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు పెరగనున్నాయి. కాగా, మేడ్చల్ జిల్లాలో 60 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇక్కడ సగం జీపీలు సిటీలో కలిశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలో 30 వరకు జీపీలు తగ్గాయి.