మళ్లీ బ్యాలెట్ పేపర్లు తేవాలి: AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ పేపర్ల విధానం తీసుకురావాలని కోరారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తీసుకొచ్చేందుకు భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేయాలని ఖర్గే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 

ఇతర పార్టీలతోను ఈ అంశంపై మాట్లాడతామని తెలిపారు. కుల గణనకు అనుమతిస్తే సమాజంలోని అన్ని వర్గాలు తమ వాటాను డిమాండ్ చేస్తాయని ప్రధాని మోదీ భయపడుతున్నారని అన్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచాలని మోదీ నిజంగా అనుకుంటే విద్వేషాలను వ్యాప్తి చేయడం మానుకోవాలన్నారు. కొందరు రాజ్యాంగంపై నకిలీ భక్తిని ప్రదర్శిస్తుంటారని, లోపల మాత్రం రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తుంటారని ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.