
- 11 మంది మృతి.. 22 మందికి గాయాలు.. నలుగురు టెర్రరిస్టులను చంపేశామన్న ఆర్మీ
- 90 మందిని చంపేశామన్న బలూచ్ మిలిటెంట్లు
- భారీగా పేలుడు పదార్థాలతో నిండిన వెహికల్తో
- కాన్వాయ్‌లో బస్సును ఢీకొట్టిన సూసైడ్ బాంబర్
- ఒక బస్సు తునాతునకలు.. తీవ్రంగా దెబ్బతిన్న మరో రెండు
- పేలుడు తర్వాత వెహికల్స్‌పై టెర్రరిస్టుల కాల్పులు
- పాకిస్తాన్లో ఒక్కరోజే 19 చోట్ల దాడులు
క్వెట్టా,కరాచీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో మిలటరీ కాన్వాయ్ పై భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది మృతిచెందగా.. 22 మంది గాయపడ్డారని పాక్ఆర్మీ ప్రకటించింది. ఆదివారం బలూచిస్తాన్ లోని నౌష్కి జిల్లాలో జరిగిన ఈ సూసైడ్ఎటాక్కు బాధ్యులం తామే అంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. అయితే తాము ఈ దాడిలో మొత్తం 90 మంది సైనికులను చంపేశామని పాక్‌లోని వివిధ మీడియా సంస్థలకు పంపించిన ఈ–మెయిల్లో తెలిపింది.
తమ ఆత్మాహుతి దళం మాజిద్బ్రిగేడ్, గెరిల్లా దళం ఫతే స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు పేర్కొన్నది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ ఘటన తర్వాత వారం రోజుల్లోపే మరో పెద్ద ఘటన చోటుచేసుకోవడం, ఒక్క శనివారమే పాక్ ఆర్మీ, పోలీసులు, భద్రతా దళాలు, ప్రభుత్వ అధికారులు లక్ష్యంగా మొత్తం 19 దాడులు జరగడంతో పాక్ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
దెబ్బతిన్న మూడు బస్సులు
బలూచిస్తాన్‌లోని క్వెట్టా నుంచి తఫ్తాన్‌కు ఎనిమిది బస్సులు, రెండు కార్లతో కూడిన ఫ్రాంటియర్ కార్ప్ (ఎఫ్సీ) పారామిలిటరీ కాన్వాయ్బయల్దేరింది. నౌష్కి జిల్లాలోని రఖ్షాన్ మిల్స్ సమీపంలో హైవేపై సైనికుల కాన్వాయ్‌ను పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సూసైడ్ బాంబర్ ఢీకొట్టాడు. భారీ పేలుడు సంభవించి ఒక బస్సు తునాతునకలవగా.. మరో రెండు బస్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో టెర్రరిస్టులు కాన్వాయ్‌పై కాల్పులు జరపగా సైనికులు కౌంటర్ చేశారని దీంతో నలుగురు టెర్రరిస్టులు మృతిచెందినట్టు ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆత్మాహుతి దాడిలో 11 మంది మృతిచెందారని.. 22 మంది గాయపడ్డారని వెల్లడించింది. మృతదేహాలను, క్షతగాత్రులను హెలీకాప్టర్‌లో ఆసుపత్రికి తరలించినట్టు నౌష్కి జిల్లా పోలీస్ ఆఫీసర్ జాఫర్ తెలిపారు. ఈ దాడిని ప్రధాని షాబాజ్ షరీఫ్, అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ, బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఖండించారు.
మాజిద్బ్రిగేడ్.. ఫతే స్క్వాడ్ కలిసి దాడి
కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడిని తామే చేశామని బీఎల్ఏ పాక్‌లోని కొన్ని మీడియా సంస్థలకు ఈ–మెయిల్ద్వారా వెల్లడించింది. తమ ఫిదాయీ యూనిట్ మాజిద్బ్రిగేడ్, గెరిల్లా పోరాట దళం ఫతే స్క్వాడ్ సంయుక్తంగా దాడికి పాల్పడ్డాయని తెలిపారు. ఈ ఎటాక్‌లో 90 మంది సైనికులను చంపేశామని వెల్లడించింది.
సూసైడ్బాంబర్ తన వెహికల్తో ఢీకొట్టిన బస్సు పూర్తిగా ధ్వంసం అయిందని.. అదే సమయంలో ఫతే స్క్వాడ్ యోధులు ఒక బస్సును చుట్టుముట్టి అందులో ఉన్న వారందరిని అంతమొందించారని పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.
ఒక్కరోజే పెద్దసంఖ్యలో దాడులు
శనివారం పాక్‌లోని వివిధ ప్రాంతాల్లో సైన్యం, పోలీసులు, ప్రభుత్వ అధికారులు లక్ష్యంగా పెద్దఎత్తున దాడులు జరిగాయి. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో జరిగిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలుడులో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎఫ్) సిబ్బంది ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
కరని ప్రాంతంలోని బరోరి రోడ్డులో ఏటీఎఫ్ పెట్రోలింగ్ వాహనం టార్గెట్‌గా ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా.. ఏడుగురు అధికారులు గాయపడ్డారు. ఇదే రీతిలో పలు చోట్ల ఎటాక్స్ జరిగినట్టు మీడియాలో వార్తలు వెలువడడం ప్రజల్లో ఆందోళన కలిగించింది.