Pakistan train hijack: 214 మంది పాక్​ సైనికులను చంపేశాం..బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ ప్రకటన

Pakistan train hijack: 214 మంది పాక్​ సైనికులను చంపేశాం..బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ  ప్రకటన
  • బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ  ప్రకటన
  • డెడ్​లైన్​ ముగిసినా పాక్ స్పందించలేదని విమర్శ
  • ఆపరేషన్​ సక్సెస్​ అంటూ అబద్ధం చెబుతోందని ఫైర్​

ఇస్లామాబాద్: పాకిస్తాన్​లో ప్యాసింజర్​ ట్రైన్​ను హైజాక్​ చేసిన బలూచ్​ లిబరేషన్​ ఆర్మీ (బీఎల్ఏ) కీలక ప్రకటన చేసింది. తమ చెరలో ఉన్న 214 మంది పాక్ ​సైనికులను చంపేసినట్టు వెల్లడించింది. తమ రాజకీయ ఖైదీలను విడుదల చేసేందుకు పాకిస్తాన్​ ప్రభుత్వానికి ఇచ్చిన 48 గంటల సమయం ముగియడంతోనే ఈ పని చేశామని తెలిపింది. ఆపరేషన్ ముగిసిందంటూ పాకిస్తాన్​ ప్రభుత్వం చేసిన ప్రకటనను బీఎల్ఏ ఖండించింది.  ‘‘మా రాజకీయ ఖైదీల విడుదలకు పాకిస్తాన్​ సర్కారుకు 48 గంటల సమయం ఇచ్చాం. కానీ, పాక్​  సర్కారు మొండితనంగా సైనిక దురహంకారాన్ని ప్రదర్శించింది. దీంతో మా చెరలో ఉన్న 214 మంది బందీలను హతమార్చాం” అని బీఎల్ఏ ఒక ప్రకటనలో తెలిపింది.

అంతర్జాతీయ చట్టాలకు తగ్గట్టుగానే.. 

తామెప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు తగ్గట్టుగానే వ్యవహరిస్తామని బీఎల్​ఏ  పేర్కొన్నది. పాకిస్తాన్​సైన్యం వారి సిబ్బందిని కాపాడుకునేందుకు బదులుగా తమతో పోరాటానికి సిద్ధమైందని, ఫలితంగానే బందీలను కోల్పోయిందని తెలిపింది.  జాఫర్​ఎక్స్​ప్రెస్ బోగీల్లోకి  ఎస్ఎస్​జీ కమాండోలు రాగా.. తమ బీఎల్​ఏ సిబ్బంది వారిపై భీకర దాడి చేసినట్టు చెప్పింది. ఈ దాడిలో ఎస్ఎస్​జీ కమాండోలతోపాటు బందీలు చాలామంది ప్రాణాలు కోల్పోయారని, తమ సభ్యులు చివరి బుల్లెట్​ వరకూ పోరాడారని పేర్కొన్నది. బీఎల్ఏకు చెందిన 12 మంది సిబ్బంది ప్రాణాలొదిలారని తెలిపింది. అయితే, చనిపోయిన తమ బీఎల్ఏ సభ్యుల డెడ్​బాడీలను చూపించి..  విజయం సాధించామని పాక్​సర్కారు వాస్తవాలను దాచిపెడుతున్నదని మండిపడింది. ఈ యుద్ధం ఇంకా ముగియలేదని, ఆక్రమిత ప్రాంతాల్లో తమ సిబ్బంది ఇంకా పోరాడుతున్నారని పేర్కొన్నది. హైజాక్‌‌ సమయంలో మరణించిన తమ సభ్యులకు బీఎల్​ఏ సంస్థ నివాళులర్పించింది.