
బాంబులు, కాల్పుల మోతలతో నిత్యం అంగ్ని గుండంలా ఉండే పాకిస్తాన్ లో టెర్రరిస్టులు మరోసారి చెలరేగారు. ట్రైన్ పై విచ్చలవిడిగా కాల్పులు జరిపి హైజాక్ చేశారు. ట్రైన్ డ్రైవర్ (లోకో పైలట్) లక్ష్యంగా దారుణంగా కాల్పులు జరిపి హైజాక్ చేశారు. లోకో పైలట్ గాయపడటంతో ట్రైన్ లోని ప్రయాణికులను తరలించి బంధీలుగా చేశారు.
పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో జరిగింది ఈ ఘటన. 400 మంది ప్రయాణికులతో బలూచిస్తాన్ లోని క్వెట్టా నుంచి పెశావర్ వెళ్తున్న ట్రైన్ పై అతి దారుణంగా మెరుపు దాడి చేసి ఓపెన్ ఫైర్ కు దిగారు టెర్రరిస్టులు. ఈ దాడిలో లోకో పైలట్ తో పాటు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
దాడి చేసింది తామేనని బలూచిస్తాన్ లిబరల్ ఆర్మీ (BLA) అనే మిలిటెంట్ గ్రూప్ ప్రకటించుకుంది. కొంతమంది అధికారులతో పాటు 100 మంది ప్రయాణికులను బంధించినట్లుగా ప్రకటించింది.
‘‘మష్కాఫ్, ధాదర్, బోలన్ ప్రాంతాల్లో మిలిటెంట్ ఆపరేషన్స్ తర్వాత.. జాఫర్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేశాం. కాల్పుల్లో 6 మంది ఆర్మీ అధికారులు మృతి చెందారు. వంద మంది ప్రయాణికులను కస్టడీలోకి తీసుకున్నాం’’ అని BLA ప్రకటన విడుదల చేసింది.
ఈ ఘటనపై అత్యవసర చర్యలు తీసుకుంటున్నట్లు బలూచిస్తాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి షాహిద్ రింద్ తెలిపారు. బంధీలను త్వరలోనే విడిపాస్తామని ప్రకటించారు.
బలూచిస్తాన్ ప్రత్యేక ప్రాంతంగా ఏర్పాటు చేయాలని బలూచిస్తాన్ లిబరల్ ఆర్మీ (BLA) మిలిటెంట్ ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే.