వాణిజ్య పంటగా వెదురు.. కేరళ తరహా మిషన్ బాంబూ

నిర్మల్, వెలుగు:  కేరళలో  సక్సెస్ అయిన మిషన్ బంబూ తరహాలో రాష్ట్రంలోనూ వెదురు సాగును  పెంచేందుకే  హార్టికల్చర్ డిపార్ట్​మెంట్ యాక్షన్ ప్లాన్ చేపట్టింది. ఇందులో భాగంగా  రైతులకు అవగాహన కల్పించేందుకు  నిర్మల్ జిల్లా ముధోల్ లో మోడల్ బంబూ ఫామ్ ను ఏర్పాటు చేశారు. ఇరవై ఎకరాల్లోని  4 రకాల వెదురు మొక్కలను పెంచుతున్నారు. 2019 లో ఏర్పాటు చేసిన ఈ ఫామ్​లో పెంచిన  వెదురు మొక్కలను రైతులకు పంపి ణీ చేస్తారు.

జిల్లాలోని  ముధోల్ లో  వెదురు మోడల్ ఫామ్ ను 20 ఎకరాల్లో ఏర్పా టు చేశారు. ఇక్కడ నాలుగు రకాల వెదురు మొక్కలను  పెంచుతున్నారు. 12 వేల ఎకరాలలో బాంబుజా తుల్డా రకం, 1600 ఎకరాల్లో  బాంబు జా బాల్కోవా, 300 ఎకరాలలో డెండ్రో కళామస్ లాటరీ ఫోరస్ రకం, మరో 300 ఎకరాలలో డెండ్రో కళామస్ బ్రాండ్సి రకం  మొక్క లు పెంచుతున్నారు. 

వెదురుతో మంచి లాభాలు 

టేకు కలపకు ప్రత్యామ్నాయంగా వెదురును  సాగు చేసేలా  రైతులకు అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఇప్పటివరకు  అడవుల్లో పెరుగుతున్న వెదురును రైతులు తమ భూముల్లో కమర్షియల్​ పంటగా  సాగు చేసే విధంగా హార్టికల్చర్ డిపార్ట్​మెంట్ కృషి చేస్తోంది.  ఒక ఎకరంలో వెదురు సాగు చేసేందుకు రూ. 20 నుంచి 25 వేల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం  మార్కెట్​లో  బంబూకు డిమాండ్ బాగా ఉంది.  

ఎకరానికి  రూ.  50 వేలకు పైగా ఆదాయం వస్తుందని అంటున్నారు.  వెదురుచెట్టు 50 ఏళ్ల వరకు బతికిఉంటుందని, ఈ పంట సాగు చేస్తే రైతులకు మంచి లాభాలు వస్తాయని అధికారులు చెప్తున్నారు.  చీడపీడల సమస్య ఉండదని,  అగ్నిప్రమాదాలనుంచి కాపాడుకుంటే  సరిపోతుందని వివరిస్తున్నారు.   విదేశాల్లోనూ వెదురుకు  డిమాండ్ ఉండడంవల్ల ఎగుమతి చేసే అవకాశాలు కూడా ఉంటాయంటున్నారు. 

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం  

వెదురు పెంపకంపై రైతులకు  అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం ముధోల్ ఫామ్ లో  వెదురు మొక్కలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో సాగయ్యే వెదురు ద్వారా రైతులకు మంచి లాభాలు వస్తాయి.  ప్రత్యామ్నాయ పంటల్లో  భాగంగా వెదురు సాగు చేయాలని   రైతులకు వివరిస్తున్నాం. సాగు మెలకువలతో పాటు మార్కెటింగ్, వివిధ రకాల ఉత్పత్తుల తయారీ లాంటి అంశాలపై రైతులకు శిక్షణ కూడా ఇస్తాం.  - శ్యామ్ రావు రాథోడ్, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్, నిర్మల్.