వెదురు సాగుకు సర్కారు ప్రోత్సాహం

వెదురు సాగుకు  సర్కారు ప్రోత్సాహం

జిల్లాలో ఈ  ఏడాది టార్గెట్​ 5 వేల ఎకరాలు
ఫ్రీగా మొక్కల పంపిణీ.. మూడేండ్ల దాక సబ్సిడీలు
ఇప్పటివరకు ఆరు ఎకరాల్లో సాగు.. మరో ఆరు దరఖాస్తులు 
రైతులకు అవగాహన కల్పిస్తున్న హార్టికల్చర్​ అధికారులు 

మంచిర్యాల, వెలుగు:  రైతులకు ప్రత్యామ్నాయ పంటగా వెదురు సాగు లాభదాయకంగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఉద్యాన పంటల్లో ఇది ఒకటి. ఒక్కసారి నాటితే దాదాపు 50 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. చీడపీడల బెడద ఉండదు. ఎరువులు, పురుగు మందులు అవసరం లేదు. అన్ని రకాల నేలలు  సాగుకు అనుకూలం. మన దగ్గర డిమాండ్‌కు సరిపడా దిగుబడి లేకపోవడంతో ప్రభుత్వం వెదురు సాగును ప్రోత్సహిస్తోంది.  హార్టికల్చర్​ డిపార్ట్​మెంట్​ ద్వారా 50 శాతం వరకు సబ్సిడీలను అందిస్తోంది. 

5 వేల ఎకరాలు టార్గెట్..   

జిల్లాలో ఈ ఏడాది 5,048 ఎకరాల్లో వెదురు సాగు చేయాలని ప్రభుత్వం టార్గెట్​ పెట్టింది. కేటగిరీల వారీగా జనరల్ 3,400 ఎకరాలు, ఎస్సీ 1,018 ఎకరాలు, ఎస్టీ 630 ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించింది.  ఒక్కో రైతుకు గరిష్టంగా ఐదెకరాల వరకు రాయితీలు వర్తిస్తాయి.  రైతులు మొక్కలను రెండు పద్ధతుల్లో పొలాల్లో నాటుకోవచ్చు.  బ్లాక్​ ప్లాంటేషన్​ పద్ధతిలో ఎకరానికి 160,  బౌండరీ ప్లాంటేషన్​ పద్ధతిలో పొలం చుట్టూ గట్లపై ఎకరానికి 130  మొక్కలను నాటుకోవచ్చు. సిద్ధిపేట జిల్లా ములుగులోని సీవోఈ నుంచి అవసరమైన మొక్కలను సప్లై చేస్తారు.  

ఇసుకతో కూడిన బంకమన్ను, ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు వెదురు సాగుకు అనుకూలం.  చౌడు, ఆమ్ల నేలలు వెదురు పెంచడానికి పనికిరావు. నేలలో ఉదజని (హైడ్రోజన్)  సూచిక 6.5 నుంచి 7.5 వరకు ఉండాలి.  రెండు  అడుగుల వరకు మంచి మట్టి ఉంటే వెదురు బాగా పెరుగుతుంది. జిల్లాలో ఇప్పటివరకు ముగ్గురు రైతులు ఆరు ఎకరాల్లో సాగు చేయగా, మరో ఆరుగురు రైతులు దరఖాస్తు పెట్టుకున్నారు.  

మూడేండ్ల వరకు సబ్సిడీలు 

బ్లాక్ ప్లాంటేషన్​ పద్ధతిలో వెదురు సాగుకు ఎకరానికి రూ.40 వేలు ఖర్చవుతుంది. ఇందులో 50 శాతం అంటే రూ.20 వేలు సబ్సిడీ వస్తుంది. మొదటి సంవత్సరం రూ.10 వేలు, రెండో సంవత్సరం రూ. 6 వేలు, మూడో  సంవత్సరం రూ.4 వేలు ఇస్తారు.  బౌండరీ ప్లాంటేషన్​ పద్ధతిలో మొదటి సంవత్సరం రూ.7,800, రెండో సంవత్సరం రూ.4,680, మూడో సంవత్సరం రూ.3,120 చొప్పున సబ్సిడీ వస్తుంది.   

ఎకరాకు 14 టన్నుల దిగుబడి

వెదురు మొక్కలు నాటిన ఐదేండ్ల నుంచి కటింగ్​ చేసుకోవచ్చు.  ఏటా ఎకరానికి 10 నుంచి 14  టన్నుల దిగుబడి వస్తుంది.  ఇలా దాదాపు 50 సంవత్సరాలకు పైగా పంట చేతికొస్తుంది.  ప్రస్తుతం టన్నుకు రూ. 27 వేల ధర పలుకుతుండగా, ఏటేటా పెరిగే అవకాశం ఉంటుంది.  ఎరువులు, పురుగుమందుల అవసరం లేకపోవడంతో సాగు ఖర్చులు కలిసివస్తాయి.  మార్కెటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు.  సిర్పూర్‌‌కాగజ్​నగర్​లోని పేపర్​ మిల్లు యాజమాన్యం మార్కెట్​ రేటుకు వెదురు కొనుగోలు చేస్తుంది. 

పదెకరాల్లో సాగు చేస్తున్న రైతు

బెల్లంపల్లికి చెందిన దాసరి రఘు అనే రైతు ఎక్కువ విస్తీర్ణంలో వెదురును సాగు చేస్తున్నాడు. రెండేండ్ల కిందట వెదురు సాగు ఆరంభించాడు. ప్రస్తుతం పదెకరాల్లో మొక్కలు నాటగా ఏపుగా పెరుగుతున్నాయి. వెదురులో దాదాపు వంద రకాలు ఉన్నప్పటికీ బల్కోవ, న్యూటన్​, బ్యాంబుస, పాలిమర్చా, కిమోనో, బురిఫెరా వంటి రకాలు లాభదాయంగా ఉంటాయి. ఈ రకాలు ఎకరానికి 20 టన్నుల వరకు దిగుబడి వస్తాయి. రఘు మహారాష్ర్ట నుంచి నాలుగైదు రకాల మొక్కలు తెచ్చి ఎకరానికి 400 చొప్పున 
నాటాడు.

రైతులకు లాభదాయకం....

ప్రభుత్వం వెదురు సాగును ప్రోత్సహించేందుకు మొక్కలు నాటిన మూడేండ్ల వరకు సాగు ఖర్చుల్లో 50 శాతం సబ్సిడీలు అందిస్తోంది. ఇతర సంప్రదాయ పంటల సాగు కంటే వెదురు సాగు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పొలాలతో పాటు గట్లపైనా నాటుకోవచ్చు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. - అనిత, జిల్లా హార్టికల్చర్​ అధికారి