ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​

మహబూబ్​నగర్​, వెలుగు:  వెదురు ఉత్పత్తులు జీవితంలో భాగమయ్యాయని,  ప్రతి ఇంట్లో వీటిని వినియోగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్​ చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​ హౌస్​ సమీపంలో మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన  ప్రపంచ వెదురు దినోత్సవానికి  చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెదురు ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్‌‌ను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు.  వెదురు వల్ల  పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదన్నారు.  మిగతా వృక్షాలతో పోలిస్తే  వెదురు చెట్లు పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్​ను పీల్చుకుని ఆక్సిజన్​ను వదులుతాయని చెప్పారు.  హరితహారం కింద వెదురుకు ప్రాధాన్యం ఇస్తున్నామని,  స్థానికంగా కనీసం పది ఎకరాల్లో హైబ్రీడ్ రకం వెదురు మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. పాలమూరులో కొత్తగా నిర్మిస్తున్న శిల్పారామంలో వెదురు ఉత్పత్తులతో ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేస్తామని, జిల్లా మేదర సంఘం భవనం ఏర్పాటుకు స్థలం, నిధులు కూడా కేటాయిస్తామని  హామీ ఇచ్చారు.

మేదరులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలి

నారాయణపేట, వెలుగు:  మేదరులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని మహేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు కోన రాజశేఖర్​ డిమాండ్​ చేశారు. ఆదివారం ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో పలు ఉత్పత్తులను ప్రదర్శించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ  వెదురు వృత్తిపై జీవనం సాగిస్తున్న మేదరులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో  మేద రిసంఘం నేతలు పులి శివకుమార్​,  పులి బాలరాజు,  వినోద్​కుమార్​ పాల్గొన్నారు.

ప్రకాశ్‌‌రెడ్డి రజకులకు సారీ చెప్పాలి

అలంపూర్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లను గడగడలాడించిన వీరనారి చాకలి ఐలమ్మ పాత్రను చిట్టెలుకతో పోల్చిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌‌ రెడ్డి రజకులకు సారీ చెప్పాలని బీఎస్పీ గద్వాల జిల్లా అధ్యక్షుడు కేశవ్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం  ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు  కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సారీ చెప్పకపోతే  రజకులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఉండవెల్లి మండల అధ్యక్షుడు ప్రభుదాస్,  నేతలు పాల్గొన్నారు.

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

ఆలంపూర్, వెలుగు: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం నేతలు డిమాండ్ చేశారు.  ఆదివారం అలంపూర్‌‌‌‌ చౌరస్తాలోని క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో ఎమ్మెల్యే అబ్రహంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌‌‌  వారంలో గిరిజనులకు 10 శాతం  రిజర్వేషన్‌‌ ప్రకటించిన నేపథ్యంలో వాల్మీకీ బోయలను ఎస్టీ జాబితాలో  చేర్చాలని కోరారు.  స్పందించిన ఎమ్మెల్యే ట్రైబల్ వెల్ఫేర్‌‌‌‌ మినిస్టర్  సత్యవతి రాథోడ్‌‌తో ఫోన్‌‌లో మాట్లాడారు.  వాల్మీకుల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని ఆమె హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు మద్దిలేటి, రామానాయుడు, తిరుపతి నాయుడు, అయ్యన్న, రమేశ్, తిమ్మాపురం నారాయణ, జగన్మోహన్ నాయుడు పాల్గొన్నారు.

గొడవ పడ్డ కవులు, కళాకారులు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: తమకంటే తమకు ముందుగా సన్మానం చేయాలని కొందరు కవులు, కళాకారులు గొడవకు దిగారు. వజ్రోత్సవాల్లో భాగంగా నాగర్‌‌‌‌ కర్నూల్‌‌ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌‌ హాల్లో దాదాపు 500 మంది కవులు, కళాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అయితే అధికారులు తయారు చేసిన లిస్టులో ముందున్న పేర్లు కాకుండా.. చివరలో ఉన్న వారిని పిలిచి సన్మానం చేయడంతో గొడవ మొదలైంది. కొందరు కళాకారులు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని స్టేజీ పైకి వెళ్లి మైకు లాక్కున్నారు.  పోలీసులు జోక్యం చేసుకోవడంతో అలిగి స్టేజ్ కిందికు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.  ఇదంతా ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ముందే జరగడం గమనార్హం.

కొత్త పార్లమెంట్‌‌కు అంబేద్కర్ పేరు పెట్టాలి

టీఎంఎం రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు:  కొత్త పార్లమెంట్‌‌తో పాటు రాష్ట్రంలోని 33  కలెక్టర్లేట్లకు అంబేద్కర్‌‌‌‌ పేరు పెట్టి, ఆయన విగ్రహాలు ప్రతిష్ఠించాలని టీఎంఎం రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామి డిమాండ్ చేశారు.  ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్‌‌‌‌ పేరు పెట్టే అంశంపై సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద  ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతామని చెప్పారు.  రాజకీయ పార్టీలతో పాటు  ప్రజా, యువజన సంఘాల నాయకులు మద్దతివ్వాలని కోరారు.  టీఎంఎం జిల్లా ప్రెసిడెంట్ పారుపల్లి శేఖర్, వైస్ ప్రెసిడెంట్  సత్తయ్య,  జాయింట్ సెక్రటరీ   రవికుమార్,  ట్రెజరర్ ఆంజనేయులు,  నేతలు  రవికుమార్, ఈశ్వర్, నాగయ్య, చెన్నయ్య, రమేశ్, గంటి చిన్న, ఆనంద్ పాల్గొన్నారు.         

హక్కుల సాధనకు మహిళలు ఏకమవ్వాలి
పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు రమ

నారాయణపేట, వెలుగు: హక్కుల సాధన కోసం మహిళలంతా సంఘటితంగా పోరాటం చేయాలని పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు కె.రమ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి చీఫ్‌‌ గెస్టుగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో సగం ఉన్న మహిళలు ఇంటాబయటా లైంగిక వేధింపులు, దాడులు, వివక్షకు గురవుతున్నారని వాపోయారు.  విద్య, ఉద్యోగంతో పాటు బాధ్యతల నిర్వహణలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నా.. చిన్నచూపు మాత్రం పోవడం లేదన్నారు.  మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నా అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు.  జిల్లా కేంద్రంలో అక్టోబర్​ 8,9 తేదీల్లో రాష్ట్ర 7వ మహాసభలను నిర్వహిస్తున్నామని, సక్సెస్ చేయాలని కోరారు. 
దక్షిణ తెలంగాణను పట్టించుకోని కేసీఆర్

బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్‌‌చార్జి మురళీధర్​రావు

నారాయణపేట, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌ దక్షిణ తెలంగాణకు కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదని,  పేట జిల్లా నుంచే కృష్ణా నది వెళ్తున్నా ఇక్కడి రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్‌‌చార్జి మురళీధర్​రావు మండిపడ్డారు.  ‘ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర’లో భాగంగా ఆదివారం నారాయణపేట పట్టణంలో నిర్వహించిన బైక్​ర్యాలీలో చీఫ్‌‌గెస్టుగా పాల్గొన్నారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ  పేట–కొడంగల్‌‌ ఎత్తిపోతలకు సంబంధించిన  69 జీవోను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.  సాగునీరు లేక జిల్లాలో వలసలు పెరిగాయని వాపోయారు.

కేసీఆర్‌‌‌‌ ఇచ్చే వాగ్దానాలకు,  అమలుకు మధ్య పొంతనే ఉండడం లేదని విమర్శించారు.  భరోసా యాత్రతో అన్ని వర్గాల సమస్యలను తెలుసుకుంటున్నామని, పట్టణంలో కుమ్మరి వృత్తుల వారికి కనీసం మట్టి కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు.  అర్హత ఉన్నా పింఛన్‌‌ ఇవ్వడం  లేదని,  చేనేత కార్మికులను కూడా పట్టించుకోవడం లేదన్నారు.  సెంటిమెంట్‌‌, మాయమాటలతో  ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.  ఓవైసీకి భయపడి ఇన్నాళ్లు సెప్టెంబర్‌‌‌‌ 17ను పట్టించుకోని కేసీఆర్‌‌‌‌  ఇప్పుడు బీజేపీకి భయపడి సమైక్యత దినోత్సవం నిర్వహిస్తోందన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, రతంగ్​పాండురెడ్డి, జిల్లా అధ్యక్షుడు పగుడాకులు శ్రీనివాసులు,  ఉపాధ్యక్షుడు సత్యయాదవ్​, రఘువీర్​యాదవ్​,  ప్రధానకార్యదర్శి ప్రభాకర్​వర్దన్, నేతలు రఘురామయ్యగౌడ్​, సాయిబాబు, సాయిబన్న, లక్ష్మీ, వెంకట్రాములు  ఉన్నారు.

ఎంఐఎం స్ర్కిప్ట్‌‌ మేరకే సమైక్యత నినాదం

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు:  సీఎం కేసీఆర్‌‌‌‌ ఎంఐఎం స్ర్కిప్ట్‌‌ మేరకే  సమైక్యత నినాదం ఎత్తుకున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.  ఆదివారం జిల్లా కేంద్రాల్లో  నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మహబూబ్‌‌నగర్‌‌‌‌, గద్వాల జిల్లా ప్రెసిడెంట్లు వీరబ్రహ్మచారి, రామచంద్రారెడ్డి మాట్లాడుతూ   తెలంగాణ విమోచన దినంగా జరపాల్సిన సెప్టెంబర్ 17ను ఎంఐఎంకు తలొగ్గి జాతీయ సమైకత్య ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఇందులోనూ తెలంగాణ సాయుధ పోరాట అమరులను స్మరించుకోకుండా కేవలం సంక్షేమ పథకాల గురించి మాట్లాడారని మండిపడ్డారు. నిజాం, రజాకార్ల తెలంగాణ ప్రజలపై సాగించిన అరాచకాలను మరిచిపోవడం సిగ్గుచేటన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు బాలరాజు, ప్రధాన కార్యద్శి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు కృష్ణవర్ధన్ రెడ్డి, సత్యం,  కౌన్సిలర్లు రామాంజనేయులు, వీరస్వామి,  నేతలు శేఖర్, నరసింహయ్య శెట్టి, మాదన్న, గోపాలకృష్ణ, ప్రతాప్ గౌడ్, నవీన్, అంజి పాల్గొన్నారు.

రజకులను ఎస్సీలుగా పరిగణించాలి: రజక సంఘం స్టేట్ ప్రెసిడెంట్ గోపి 

జడ్చర్ల, వెలుగు: రజకులను ఎస్సీ కేటగిరి కింద గుర్తించాలని రజక సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్‌‌ గోపి డిమాండ్​ చేశారు.  ఆదివారం జడ్చర్ల పట్టణంలో  టౌన్​ ప్రెసిడెంట్‌‌ దుర్గం శ్రీనివాస్​ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి చీఫ్‌‌ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దేశంలోని17 రాష్ట్రాల్లో రజకులను ఎస్సీలుగా గుర్తించారని,   ఈ మేరకు తెలంగాణలోనూ సర్కారు జీవో జారీ చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ స్థానాలను రజకులకు కేటాయించడంతో పాటు రజకబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘం వైస్ ప్రెసిడెంట్‌‌  సంజీవ్​ ,  కో కన్వీనర్  బండలయ్య ,  ముఖ్య సలహాదారు నడిమింటి శ్రీనివాస్,  నేతలు శ్రీనివాస్, యాదయ్య,  విజయ్​కుమార్, సత్యనారాయణ, గోవర్ధన్​, రమేశ్‌‌, కృష్ణ, సతీశ్‌‌, రాజు, రవి, కృష్ణ  పాల్గొన్నారు.