Team India: క్రికెటర్ల PR ఏజెన్సీలు నిషేధించాలి.. బాంబ్ పేల్చిన హర్ష భోగ్లే

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ఓటమి భారత క్రికెటర్లకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఇన్నాళ్లూ దైపాక్షిక సిరీసుల్లో ఓడినా.. ఐసీసీ టోర్నీల్లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టినా బీసీసీఐ పెద్దగా పట్టించుకునేది కాదు. పోతే పోయిందిలే అన్నట్టు వదిలేసేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేదు. ఇచ్చిన స్వేచ్ఛను ఆటగాళ్ళు సరిగ్గా ఉపయోగించుకుంటలేరు. విదేశీ టూర్ అనగానే క్రికెట్ సంగతి దేవుడెరుగు.. పెళ్లాం, పిల్లలతో వాలిపోయి ఎంచక్కా ఆయా నగరాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇతర క్రికెట్ జట్లలో ఆ పరిస్థితి లేదు.. రూల్స్ అంటే రూల్స్.. గీత దాటారో వేటు తప్పదు. వరుస ఓటముల నేపథ్యంలో బీసీసీఐ సైతం ఇప్పటినుంచి అదే విధానాన్ని అవలంభించాలని చూస్తోంది. ఇప్పటికే పలు కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. క్రికెటర్ల కుటుంబసభ్యులు టోర్నీ అంతటా వారితో కలిసి ఉండకుండా పరిమితులు విధించింది. ఏదేని టోర్నమెంట్ 45 రోజుల కంటే ఎక్కువ జరిగితే.. కుటుంబసభ్యులకు రెండు వారాలకు అనుమతిచ్చింది. ఒకవేళ టోర్నీ అంతకంటే తక్కువగా ఉంటే.. 7 రోజులకు మాత్రమే అనుమతి. అంతేకాదు, ఆటగాళ్లు విడివిడిగా ప్రయాణించకుండా కఠిన రూల్స్ తీసుకొచ్చింది. భారత క్రికెట్‌లో చోటు చేసుకున్న కొత్త పరిణామాలపై కామెంటేటర్ హర్షా భోగ్లే స్పందించారు.

PR ఏజెన్సీలు నిషేధించాలి.. 

బీసీసీఐ కొత్త రూల్స్ బాగానే ఉన్నప్పటికీ, భారత క్రికెట్‌లో అమలు చేయాల్సిన మరో నియమాన్ని హర్షా భోగ్లే సూచించారు. రాణించకపోయినా ఆటగాళ్ల మునుపటి రికార్డులను పోస్ట్ చేస్తూ.. జట్టులో కొనసాగేలా చేస్తున్న వారి PRఏజెన్సీలు నిషేధించాలని హర్షా భోగ్లే.. బీసీసీఐకి సూచించారు.

"భారత జట్టులో బీసీసీఐ చేస్తున్న మార్పులు చదవడానికి బాగానే ఉన్నాయి. కానీ, వాటిని ఎంతవరకు విశ్వసించాలో నాకు తెలియదు. నేను ఒక నియమాన్ని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా.. ఒకవేళ వర్తింపజేయవలసి వస్తే, అది జట్టు సభ్యులు PR ఏజెన్సీలు లేకుండా నిషేధించాలి.." అని హర్షా భోగ్లే ఎక్స్(X)లో రాశారు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ..!

హర్షా భోగ్లే మాటల్లో వాస్తవం లేకపోలేదు. ఉదాహరణకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను తీసుకంటే.. సషల్ మీడియాలో వారి పీఆర్ ఏజెన్సీలదే హవా. వీరిని ఎవరు విమర్శించినా అభిమానుల పేరుతో మీద పడిపోతుంటారు. సదరు క్రికెటర్లు పదే పదే విఫలమవుతున్న జట్టు నుండి తొలగించకుండా ఉండేలా.. మునుపటి రికార్డులను పోస్ట్ చేస్తూ పక్కదారి పట్టిస్తుంటారు. ఈమధ్య హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వీరిని ఏమైనా అంటే..వ్యక్తిగతంగా ట్రోలింగ్ దిగుతారని అన్నారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లు PR ఏజెన్సీలు కలిగి ఉండకూడదని హర్షా భోగ్లే అభిప్రాయపడ్డారు.