ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై ఈసీ కీలక నిర్ణయం

ఢిల్లీ :ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రాష్ట్రాల్లో బహిరంగ సభలు, ర్యాలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎలక్షన్ కమిషన్ పొడగించింది. జనవరి 22 వరకు నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. జనవరి 8న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. ర్యాలీలు, రోడ్ షోలపై జనవరి 15 వరకు నిషేధం విధించింది. అనంతరం కరోనా పరిస్థితిని సమీక్షించి నిర్ణయం ప్రకటిస్తామని చెప్పింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, హెల్త్ సెక్రటరీలతో సమావేశమైన ఎన్నికల సంఘం నిషేధాన్ని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే రాజకీయ పార్టీలు ఇండోర్ మీటింగ్స్‌లో 300 మంది లేదా సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం మంది పాల్గొనేందుకు ఈసీ అనుమతించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను, కోవిడ్ మార్గదర్శకాలను అన్ని రాజకీయ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో భారీ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తే వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకాశమున్నందున ఈసీ నిషేధం విధించింది. అభ్యర్థులు వర్చువల్ మోడ్ లో ప్రచారం నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే సూచించింది.