ఆర్మీ యూనిఫామ్‎ల అమ్మకంపై నిషేధం

ఆర్మీ యూనిఫామ్‎ల అమ్మకంపై నిషేధం

జమ్మూ: జమ్మూకాశ్మీర్ కిష్టావర్ జిల్లాలో ఆర్మీ యూనిఫామ్‎ల విక్రయం, కుట్టడం, నిల్వలపై అధికారులు నిషేధం విధించారు. దేశ వ్యతిరేక శక్తులు ఆర్మీ యూనిఫామ్‎లను దుర్వినియోగం చేయకుండా ఉండటానికి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గాం దాడికి పాల్పడిన టెర్రరిస్టులు ఆర్మీ యూనిఫామ్ లు ధరించి అటాక్స్ చేయడంతో అధికారులు ఈ చర్యకు పూనుకున్నారు. ఈ మేరకు శనివారం కిష్టావర్ డిప్యూటీ కమిషనర్ రాజేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​ కొన్ని నిబంధనలు, ఆంక్షలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్మీ యూనిఫామ్ ల కొనుగోళ్లు, నిల్వ, విక్రయాలు చేసే అన్ని దుకాణాలు తమ వ్యాపారాన్ని కొనసాగించడం కోసం సమీపంలోని పోలీస్ స్టేషన్లకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. యూనిఫామ్​ల అమ్మకాలపై ప్రతి15 రోజులకు ఒకసారి నివేదిక సమర్పించాలని తెలిపారు. వీటిని కొనుగోలు చేసిన సైన్యం, పారామిలిటరీ, పోలీస్ సిబ్బంది వివరాలు సమర్పించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ లిస్ట్​ను డీలర్ లేదా సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్​కు 15 రోజులకు ఒకసారి అందిస్తారు.