న్యూజిలాండ్ పర్యటనలో బంగ్లాదేశ్ జట్టు సంచలన విజయాలు సాధిస్తోంది. రెండ్రోజుల క్రితం నేపియర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో కివీస్‌ను చిత్తు చేసి చరిత్ర సృష్టించి బంగ్లా పులులు... నేడు అదే వేదికపై కివీస్ వీరులను మరోసారి మట్టికరిపించారు. తొలి టీ20లో బంగ్లా 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు.. బంగ్లా బౌలర్లు విజృంభించడంతో 134 పరుగులకే పరిమితమైంది. జిమ్మీ నీషమ్ (48), కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (23) మినహా మిగిలిన వారందరూ విఫలమయ్యారు. మొదట మెహదీ హసన్, షోరిఫుల్ ఇస్లాం జోడి వరుస వికెట్లు తీసి.. కివీస్‌ను ఆరంభంలోనే దెబ్బకొట్టారు. వీరిద్దరి దెబ్బకు ఫిన్ అలెన్(1), సీఫర్ట్(0), డారిల్ మిచెల్(14), గ్లెన్ ఫిలిప్స్(0) త్వరగా పెవిలియన్ చేరారు. ఆ తరువాత మార్క్ చాప్ మెన్(19) కాసేపు ఆదుకున్నా భారీ స్కోర్ చేయలేకపోయాడు. ఆ సమయంలో నీషమ్- సాట్నర్ జోడి జట్టును ఆదుకున్నారు. చివరలో వీరిద్దరూ వెనుదిరిగాక కివీస్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజర్ రెహ్మాన్ రాణించారు.
రాణించిన లిటన్ దాస్
అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనను బంగ్లా మరో 8 బంతులు మిగిలివుండగానే చేధించింది. ఓపెనర్ లిటన్ దాస్ (42 నాటౌట్) బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్ గడ్డపై టీ20ల్లో బంగ్లాదేశ్ జట్టుకు ఇదే తొలి విజయం. ఈ ఇరు జట్ల మధ్య శుక్రవారం(డిసెంబర్ 29) మౌంట్ మాంగనూయ్ వేదికగా రెండో టీ20 జరగనుంది.
A strong start to the KFC T20 Series by Bangladesh. Game 2 is at Bay Oval on Friday. Scorecard | https://t.co/3qaJhfLqKO #NZvBAN pic.twitter.com/3gyDWB65t5
— BLACKCAPS (@BLACKCAPS) December 27, 2023