వీడియో: శభాష్ బంగ్లా కెప్టెన్.. ఔటైన బ్యాటర్‌కు మరో అవకాశం

వీడియో: శభాష్ బంగ్లా కెప్టెన్.. ఔటైన బ్యాటర్‌కు మరో అవకాశం

ఔటైన ఆటగాడు మరోసారి బ్యాటింగ్ చేయడమన్నది అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా అరుదు. క్రీడాస్ఫూర్తి అన్నది పాటించాల్సినదే అయినా.. జట్టు ఓటమి యావత్ దేశాన్నీ బాధిస్తుంది కనుక అలాంటి నిర్ణయాల గురుంచి ఆటగాళ్లు పెద్దగా ఆలోచించరు. కానీ, బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ ఆలోచనలు మాత్రం అందుకు విభిన్నం. ఔటైన ఆటగాడు పెవిలియన్ బాట పట్టగా.. అతన్ని పిలిచిమరీ మరోసారి బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా సొంతగడ్డపై బంగ్లాదేశ్ జట్టు.. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో వన్డేలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన కివీస్ 49.2 ఓవర్లలో 254 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. అయితే ఈ మ్యాచ్‍లో బంగ్లా కెప్టెన్ లిట్టన్ దాస్ తీసుకున్న ఒక నిర్ణయం ఆ దేశ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.

ఏం జరిగిందంటే..?

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో కివీస్ బ్యాటర్ ఇష్ సోది రనౌట్(మన్కడింగ్) అయ్యాడు. బంతి వేయడానికి ముందే క్రీజు వదిలి వెళ్లడంతో బంగ్లా బౌలర్ హాసన్ మహ్మద్ అతనిని మన్కడింగ్ చేశాడు. దీంతో థర్డ్ అంపైర్ బౌలర్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ అవుట్ అని ప్రకటించగా.. ఇష్ సోది పెవిలియన్ బాట పట్టాడు. కానీ, అంతలోనే లిట్టన్ దాస్ కల్పించుకొని తమ జట్టు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. దీంతో సోది మరోసారి బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ అవకాశాన్ని సోది సద్వినియోగ పరుచుకున్నాడు. ఆఖరిలో 39 బంతుల్లో 3 సిక్సుల సాయంతో 35 పరుగులు(17 పరుగుల వద్ద ఔట్) చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.