
‘‘గోదావరి వరద జలాలనే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్తున్నాం. దీని వల్ల తెలంగాణకు ఏమి నష్టం?’’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు వాదిస్తున్నా దాని వెనుక ఉన్న ఉద్దేశాలపై చాలా అనుమానాలు కలుగుతున్నాయి. గోదావరి వరద మళ్లింపు సాకుతో కృష్ణా నీటినే గంపగుత్తగా తరలించుకుపోయే కుట్ర జరుగుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. గోదావరి – బనకచర్ల (జీబీ) లింకును నేరుగా సాగర్కెనాల్కు కలపడం, అక్కడి నుంచి 150టీఎంసీల కెపాసిటీతో కట్టబోయే బొల్లపల్లి రిజర్వాయర్‌కు మళ్లించడమంటే కృష్ణా నీటి దోపిడీకీ ఇది మరో పోతిరెడ్డిపాడుగా మారుతుందనడంలో సందేహం లేదు.
కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో అదే అదనుగా కృష్ణా నీటిపై శాశ్వత హక్కులను సొంతం చేసుకునే ఆలోచనతోనే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును బాబు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా లెక్కాపత్రం లేకుండా, టెలీమెట్రీలు పెట్టకుండా కృష్ణా నీళ్లను అక్రమంగా మళ్లించుకుంటున్న ఏపీ పాలకులు గోదావరిని, కృష్ణాతో లింకు చేస్తూ ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తిచేస్తే ఏ నీళ్లు ఎటువెళ్తున్నాయో తెలుసుకునేలోపే తెలంగాణ మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 880 అడుగులు నిండాక మాత్రమే పోతిరెడ్డిపాడు తూముల ద్వారా తీసుకోవడానికి వీలుగా మొదట్లో ఏర్పాట్లు ఉండేది. అది కూడా రోజుకు 1 టీఎంసీ పరిమితి ఉండేది. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు విస్తరణలో భాగంగా తూముల ఎత్తు తగ్గించడం వల్ల శ్రీశైలం నీటిమట్టం అట్టడుగున 854 అడుగుల స్థాయి నుంచే రోజుకు 4 టీఎంసీలను తీసుకునేలా కెపాసిటీ పెంచుకున్నారు. జగన్ హయాంలో చేపట్టిన రాయలసీమ స్కీంలో భాగంగా సంగమేశ్వరం లిఫ్ట్ కారణంగా శ్రీశైలం నీటిమట్టం అతితక్కువగా 800 అడుగులకు పడిపోయినా లిఫ్టింగ్ చేసి మరీ పోతిరెడ్డిపాడుకు మళ్లించుకునేలా ప్లాన్ చేసుకున్నారు. ఇన్నేళ్లుగా ఎట్లాంటి హక్కు లేకుండా, ఏ అనుమతులు లేకుండా, నీళ్ల లెక్కలు లేకుండా దోపిడీ కొనసాగుతుంటే.. ఇప్పుడు చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఈ అక్రమాన్ని శాశ్వత హక్కుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎక్కడో ఉన్న పోలవరం నుంచి నీటి మళ్లింపు మాట అట్లా ఉంచితే, పక్కనే నేరుగా కృష్ణా నీళ్లను గుంజుకునే అవకాశాన్ని ఏపీ ఎందుకు వదులుకుంటుందన్నదే అసలు ప్రశ్న. దీని వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీరని నష్టం కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కొందరు తెలంగాణ నాయకులు సైతం ఏపీ చంద్రబాబు ట్రాప్‌లో పడినట్లు అనిపిస్తోంది. జీబీ లింకు ద్వారా గోదావరి నుంచి 200 టీఎంసీల నీటిని కృష్ణాకు మళ్లించబోతున్నారని చెప్తున్నారు తప్ప శ్రీశైలం నుంచి రోజుకు 8టీఎంసీల నీటి దోపిడీకి బనకచర్ల ఇప్పటికే కేంద్రబిందువుగా ఉన్నదనే విషయాన్ని విస్మరిస్తున్నారు.
అసలుకు దిక్కులేదు.. వరద కావాలా?
గోదావరి నుంచి ఏటా వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఏపీ వాదిస్తున్నది. అలా వాడుకోకుండా సముద్రంలో కలుస్తున్న వరద జలాలనే బనకచర్లకు తరలిస్తామని అంటున్నది. వాస్తవానికి రెండు రాష్ట్రాలకు కలిపి గోదావరిలో కేటాయించిన 1486 టీఎంసీలకు మించి వాడుకునేందుకు హక్కులు లేవు. నదీ జలాల పంపకంలో భాగంగా ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్న మన రాష్ట్రానికి 968 టీఎంసీలు, ఏపీకి 516 టీఎంసీల చొప్పున నీటి కేటాయింపులున్నాయి.
అంతకుమించి వాడుకునేందుకు వీల్లేదు. కానీ దీనిపై ఏపీ వితండవాదం మొదలుపెట్టింది. సముద్రంలో వృథాగా కలుస్తున్న వరద జలాల్లోంచే ఏడాదికి 200 టీఎంసీలను తరలిస్తామంటున్నది. నిజానికి గోదావరిలో నికర జలాలనే రెండు రాష్ట్రాలు పూర్తిగా వాడుకోలేని స్థితిలో ఉన్నాయి. ఇందులో మిగులు, వరద జలాల పేరుతో కేటాయింపులనేవే లేవు. అయినా ఆ పేరుతో నీళ్లు మళ్లిస్తామంటూ చెప్పడమే అనుమానాలను పెంచుతోంది. నీటి వాడకం లెక్కలు చెప్పడానికి, టెలీమెట్రీ మీటర్లు పెట్టడానికి ఇష్టపడని ఏపీ సర్కార్ ఏ నీళ్లను వాడుకుంటుందో కూడా చెప్పలేని పరిస్థితి.