
- రాయలసీమలో శ్రీశైలం కుడి కాలువపై ఇప్పటికే బనకచర్ల రెగ్యులేటర్
- సీమ పేరుతో గోదావరి మళ్లింపు.. ఆంధ్రలో భారీ రిజర్వాయర్‌పై అనుమానాలు
- సాగర్ రైట్ కెనాల్ నుంచి నీటిని తరలించి బొల్లపల్లి రిజర్వాయర్‌లో దాచుకునే చాన్స్
- కేంద్రం నిధులతో కెనాల్స్, టన్నెళ్లు, లిఫ్టులతో పకడ్బందీ వ్యవస్థకు ప్లాన్
- డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ పెంచుకుంటే కృష్ణా నీళ్లపై ఏపీకి శాశ్వత హక్కులు?
- చంద్రబాబు ప్లాన్ ఇంకా అర్థం చేసుకోని మన సర్కార్
- చర్చించాల్సింది గోదావరి వరద జలాలపై కాదు.. బనకచర్ల కుట్రపై!
హైదరాబాద్, వెలుగు : ‘‘గోదావరి వరద జలాలనే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్తున్నాం. దీని వల్ల తెలంగాణకు ఏమి నష్టం?’’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు వాదిస్తున్నా దాని వెనుక ఉన్న ఉద్దేశాలపై చాలా అనుమానాలు కలుగుతున్నాయి. గోదావరి వరద మళ్లింపు సాకుతో కృష్ణా నీటినే గంపగుత్తగా తరలించుకుపోయే కుట్ర జరుగుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. గోదావరి – బనకచర్ల (జీబీ) లింకును నేరుగా సాగర్కెనాల్కు కలపడం, అక్కడి నుంచి 150టీఎంసీల కెపాసిటీతో కట్టబోయే బొల్లపల్లి రిజర్వాయర్‌కు మళ్లించడమంటే కృష్ణా నీటి దోపిడీకీ ఇది మరో పోతిరెడ్డిపాడుగా మారుతుందనడంలో సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో అదే అదనుగా కృష్ణా నీటిపై శాశ్వత హక్కులను సొంతం చేసుకునే ఆలోచనతోనే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును బాబు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా లెక్కాపత్రం లేకుండా, టెలీమెట్రీలు పెట్టకుండా కృష్ణా నీళ్లను అక్రమంగా మళ్లించుకుంటున్న ఏపీ పాలకులు గోదావరిని, కృష్ణాతో లింకు చేస్తూ ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తిచేస్తే ఏ నీళ్లు ఎటువెళ్తున్నాయో తెలుసుకునేలోపే తెలంగాణ మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 880 అడుగులు నిండాక మాత్రమే పోతిరెడ్డిపాడు తూముల ద్వారా తీసుకోవడానికి వీలుగా మొదట్లో ఏర్పాట్లు ఉండేది. అది కూడా రోజుకు 1 టీఎంసీ పరిమితి ఉండేది. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు విస్తరణలో భాగంగా తూముల ఎత్తు తగ్గించడం వల్ల శ్రీశైలం నీటిమట్టం అట్టడుగున 854 అడుగుల స్థాయి నుంచే రోజుకు 4 టీఎంసీలను తీసుకునేలా కెపాసిటీ పెంచుకున్నారు. జగన్ హయాంలో చేపట్టిన రాయలసీమ స్కీంలో భాగంగా సంగమేశ్వరం లిఫ్ట్ కారణంగా శ్రీశైలం నీటిమట్టం అతితక్కువగా 800 అడుగులకు పడిపోయినా లిఫ్టింగ్ చేసి మరీ పోతిరెడ్డిపాడుకు మళ్లించుకునేలా ప్లాన్ చేసుకున్నారు. ఇన్నేళ్లుగా ఎట్లాంటి హక్కు లేకుండా, ఏ అనుమతులు లేకుండా, నీళ్ల లెక్కలు లేకుండా దోపిడీ కొనసాగుతుంటే.. ఇప్పుడు చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఈ అక్రమాన్ని శాశ్వత హక్కుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడో ఉన్న పోలవరం నుంచి నీటి మళ్లింపు మాట అట్లా ఉంచితే, పక్కనే నేరుగా కృష్ణా నీళ్లను గుంజుకునే అవకాశాన్ని ఏపీ ఎందుకు వదులుకుంటుందన్నదే అసలు ప్రశ్న. దీని వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీరని నష్టం కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కొందరు తెలంగాణ నాయకులు సైతం ఏపీ చంద్రబాబు ట్రాప్‌లో పడినట్లు అనిపిస్తోంది. జీబీ లింకు ద్వారా గోదావరి నుంచి 200 టీఎంసీల నీటిని కృష్ణాకు మళ్లించబోతున్నారని చెప్తున్నారు తప్ప శ్రీశైలం నుంచి రోజుకు 8టీఎంసీల నీటి దోపిడీకి బనకచర్ల ఇప్పటికే కేంద్రబిందువుగా ఉన్నదనే విషయాన్ని విస్మరిస్తున్నారు.
అసలుకు దిక్కులేదు.. వరద కావాలా?
గోదావరి నుంచి ఏటా వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఏపీ వాదిస్తున్నది. అలా వాడుకోకుండా సముద్రంలో కలుస్తున్న వరద జలాలనే బనకచర్లకు తరలిస్తామని అంటున్నది. వాస్తవానికి రెండు రాష్ట్రాలకు కలిపి గోదావరిలో కేటాయించిన 1486 టీఎంసీలకు మించి వాడుకునేందుకు హక్కులు లేవు. నదీ జలాల పంపకంలో భాగంగా ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్న మన రాష్ట్రానికి 968 టీఎంసీలు, ఏపీకి 516 టీఎంసీల చొప్పున నీటి కేటాయింపులున్నాయి. అంతకుమించి వాడుకునేందుకు వీల్లేదు. కానీ దీనిపై ఏపీ వితండవాదం మొదలుపెట్టింది. సముద్రంలో వృథాగా కలుస్తున్న వరద జలాల్లోంచే ఏడాదికి 200 టీఎంసీలను తరలిస్తామంటున్నది. నిజానికి గోదావరిలో నికర జలాలనే రెండు రాష్ట్రాలు పూర్తిగా వాడుకోలేని స్థితిలో ఉన్నాయి. ఇందులో మిగులు, వరద జలాల పేరుతో కేటాయింపులనేవే లేవు. అయినా ఆ పేరుతో నీళ్లు మళ్లిస్తామంటూ చెప్పడమే అనుమానాలను పెంచుతోంది. నీటి వాడకం లెక్కలు చెప్పడానికి, టెలీమెట్రీ మీటర్లు పెట్టడానికి ఇష్టపడని ఏపీ సర్కార్ ఏ నీళ్లను వాడుకుంటుందో కూడా చెప్పలేని పరిస్థితి.
కృష్ణాకు గండి.. గోదాట్లో తొండి..
శ్రీశైలం నుంచి ఒక టీఎంసీ నీటి కోసం పోతిరెడ్డిపాడు తూముకు పర్మిషన్ ఇస్తే, దాన్ని పదిరెట్లకు పెంచి సొరంగంలా మార్చి ఏటా వందల టీఎంసీలను పట్టుకెళ్తున్న ఏపీ పాలకులు బనకచర్లపై నిజాలు చెప్తున్నారంటే ఎట్లా నమ్మాలన్న ప్రశ్న తలెత్తుతోంది. బనకచర్ల పేరుతో కొత్త ప్రాజెక్టుగా చెబుతున్నా ఇప్పటికే రాయలసీమలో శ్రీశైలం మెయిన్ కెనాల్‌పై బనచకర్ల రెగ్యులేటర్ ఉందన్నది వాస్తవం. పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా మళ్లిస్తున్న కృష్ణా నీళ్లు బనకచర్ల ద్వారానే సీమలో పలు ప్రాంతాలకు పోతున్నాయి. ఇంత కీలకంగా ఉన్న బనకచర్లకు, ఎక్కడో పోలవరం నుంచి లింకు కలుపుతామని చెప్పడమే తీవ్రమైన అనుమానాలకు దారితీస్తోంది. కేంద్రంలో టీడీపీ బలం మీదే ఎన్డీయే సర్కార్ ఆధారపడి ఉండడంతో ఈ ప్రాజెక్టుకు పర్మిషన్లు, సాయం తెచ్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కేంద్ర సాయంతో రూ.80వేల కోట్లతో ఏపీలో 240 కిలోమీటర్ల పొడవునా లిఫ్టులు, టన్నెళ్లు, కెనాల్స్ తో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ఇక్కడ చంద్రబాబు ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. నిజానికి ఏ నది నీళ్లయినా ఆ నది పరీవాహ ప్రాంతం (బేసిన్)లోనే ఉపయోగించుకోవాలన్నది అంతర్జాతీయ నదీ జలాల పంపిణీ నిబంధనలు చెప్తున్నాయి. దీనికి విరుద్ధంగా దశాబ్దాలుగా తెలంగాణ హక్కులకు గండి కొడుతూ కృష్ణా నీటిని పెన్నా బేసిన్‌కు తరలిస్తున్నారు. నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు మొదలు నేటి ఏపీ పాలకుల దాకా పోతిరెడ్డి పాడు పేరుతో శ్రీశైలానికి బొక్కగొట్టి ఎస్ఆర్ఎంసీ (శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్) ద్వారా సీమకు నీటిని తోడుకెళ్తున్నారు. ఈ అక్రమాన్నే తెలంగాణ ప్రజలు మొదటి నుంచీ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన పదేండ్ల తర్వాత ఇప్పుడు కృష్ణాలో తెలంగాణ అసలైన హక్కు నీళ్ల కోసం బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. న్యాయమైన వాటాలపై ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతోంది. దీంతో ఎప్పటికైనా ప్రమాదమే అని తెలిసి ప్రత్యామ్నాయంగా ఏపీ సర్కారు బనకచర్ల లింకును తెరపైకి తెచ్చినట్లు అర్థమవుతోంది. గోదావరి వరద మళ్లింపు పేరుతో కృష్ణా నీటి దోపిడీకి ముసుగేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. భవిష్యత్‌లో నీటిదోపిడీ గురించి తెలంగాణ మాట్లాడినా తాము గోదావరి నుంచే తెచ్చుకుంటున్నామని వాదించే అవకాశముంది.
ఇప్పటికే శ్రీశైలానికిభారీ రంధ్రాలు
నిజానికి జల దోపిడీకి వీలుగా ఇప్పటికే ఏపీ సర్కార్ శ్రీశైలానికి భారీ గండ్లు కొట్టింది. శ్రీశైలం వెనుక రైట్ మెయిన్ కెనాల్ మీద చిన్న తూముగా ఉన్న పోతిరెడ్డిపాడు ఇప్పుడు పెద్ద తిమింగలంలా మారి, శ్రీశైలాన్ని ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తోంది. నాలుగు దశాబ్దాల కింద ఒక టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని ఇప్పుడు ఏకంగా రోజుకు 8 టీఎంసీలకు మించి తోడుకునే స్థాయికి పెంచుకున్నారు. గతంలో నీటిమట్టాన్ని బట్టి మళ్లించడానికి మాత్రమే వీలుంటే ఇప్పుడు సంగమేశ్వరం రూపంలో లోతు నుంచి తోడి ఎత్తిపోసుకునేలా లిఫ్టులు రెడీ అవుతున్నాయి. ఇక్కడి నుంచే బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్‌కు నీటిని మళ్లిస్తుంటారు. వైఎస్ హయాంలో తెలంగాణ సెంటిమెంట్‌ను రలిగించడానికి పోతిరెడ్డిపాడు విస్తరణ అంశాన్ని ఒక ఆయుధంగా నాటి టీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుంది. అయితే తెలంగాణ సాకారమయ్యాక అదే పార్టీ అధినేత కేసీఆర్ సీఎంగా ఉండగా.. పోతిరెడ్డిపాడు గతంకంటే రెట్టింపు నీళ్ల దోపిడీకి వీలుగా విస్తరణ పనులు జరుగుతుంటే చూసీచూడనట్లు వదిలేశారు. దీంతో ఏకంగా రోజుకు 8 టీఎంసీలు, అంతకుమించిన నీటిని మళ్లించుకునే కెపాసిటీతో పోతిరెడ్డిపాడు సిద్ధమైంది. పనుల మొదట్లోనే ఈ ముప్పును ‘వీ6-వెలుగు’ గుర్తించి హెచ్చరించినా కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం చేసింది. చివరికి 90 శాతం పనులు అయ్యాక ప్రైవేటు పిటిషన్ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఇప్పటికే సొరంగాలు సిద్ధంగా ఉండడం వల్ల ఎప్పటికైనా ముప్పు పొంచి ఉంది.
తిరకాసంతా బొల్లపల్లి రిజర్వాయర్ దగ్గరే..
బనకచర్ల లింకులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా బొల్లపల్లిలో 150 టీఎంసీల కెపాసిటీతో భారీ రిజర్వాయర్ ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. గోదావరి నీటిని నాగార్జునసాగర్ కుడి కాలువ కు కలిపి, అక్కడి నుంచి బొల్లపల్లికి నీటిని మళ్లిస్తామని చెప్తున్నారు. తిరకాసంతా ఇక్కడే ఉంది. గోదావరి నుంచి నీటి మళ్లింపు సంగతేమోగానీ కృష్ణా నీళ్లను మాత్రం ఇష్టానుసారంగా వాడుకోవడానికి ఈ ప్రాజెక్టు ను వాడుకునే ప్రమాదం కనిపిస్తోంది. అటు పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను మళ్లించుకోవడానికి ఇప్పటికే అవకాశం ఉండగా, ఇటు సాగర్ కుడి కాలువ నుంచి కూడా కావాల్సినన్ని నీళ్లను మలుపుకోవడానికి ఈ బొల్లపల్లి రిజర్వాయర్ద్వారా ఏపీకి చాన్స్ దొరుకుతుంది. అసలు ఈ రిజర్వాయర్లకు వస్తున్న నీళ్లు జీబీ లింకు ద్వారా వచ్చే గోదావరివో, సాగర్ రైట్ కెనాల్ ద్వారా వచ్చే కృష్ణావో అర్థం కానంత గందరగోళం ఏర్పడుతుంది. ఇప్పటికే కృష్ణా డెల్టా పేరుతో తెలంగాణ హక్కుకు గండికొట్టారని ఆగ్రహం వ్యక్తమవుతుంటే, బనకచర్ల పేరుతో అంతకుమించిన దోపిడీకి ఆస్కారం కనిపిస్తోంది. ఇలా ఏరకంగా చూసినా గోదావరి– బనకచర్ల వల్ల తెలంగాణకు కృష్ణా నీటిలో న్యాయంగా రావాల్సిన హక్కుకు గండిపడే ముప్పు పొంచి ఉంది.
కృష్ణా జలాల కేటాయింపు ఇలా..
కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1 (బచావత్ ట్రిబ్యునల్) 1973లో కృష్ణా బేసిన్ రాష్ట్రాలైన ఏపీ (ఉమ్మడి), మహారాష్ట్ర, కర్నాటకలకు ఎన్‌బ్లాక్(గంపగుత్తా) కేటాయింపులను చేసింది.
75 శాతం డిపెండబిలిటీ (ఒక వాటర్ ఇయర్లో గరిష్ఠ వరద వచ్చే సంభావ్యత) ఆధారంగా ఒక వాటర్ ఇయర్లో 2,060 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని ట్రిబ్యునల్ తేల్చింది. అందులో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు (11 టీఎంసీలు రీజనరేటివ్ ఫ్లోస్ కలిపి), మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700 టీఎంసీలను కేటాయించింది. దీనిపై కేంద్రం 1976 మే 31న గెజిట్‌ను ప్రచురించింది.
2010లో కేడబ్ల్యూడీటీ 2 (బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) బచావత్ ట్రిబ్యునల్ అవార్డును రివ్యూ చేసింది.
47 ఏండ్ల సగటు వరదలను పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 2,578 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయని తేల్చింది.
దానికి అనుగుణంగా ఏపీకి 1001, కర్నాటకకు 911, మహారాష్ట్రకు 666 టీఎంసీల నికర జలాలను కేటాయించాల్సి ఉంటుందని సూచించింది. అయితే, కేడబ్ల్యూడీటీ 2 డ్రాఫ్ట్ అవార్డుకు కేంద్రం గెజిట్ ఇవ్వలేదు. 2013లో ఫైనల్ తీర్పు ఇచ్చిన ట్రిబ్యునల్.. బచావత్ అవార్డే కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రాల వారీగా కేటాయింపులున్నాయే తప్ప.. రీజియన్ల వారీగా కేటాయింపులు చేయలేదు.
పోతిరెడ్డిపాడు: తూము నుంచి తిమింగలం దాకా..
1988లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి చెన్నైకి మంచినీళ్లు ఇవ్వడానికి తెలుగు గంగ ప్రాజెక్టు చేపట్టారు. ఇందుకోసం శ్రీశెలం రిజర్వాయర్ ప్రాంతంలో పోతిరెడ్డిపాడు గ్రామం దగ్గర 4 తూములతో హెడ్ రెగ్యులేటర్ నిర్మించారు. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండినప్పుడు మాత్రమే రోజుకు 11,500 క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి సరిపడా కెపాసిటీతోనే దీన్ని నిర్మించారు. రోజుకు ఒక టీఎంసీ చొప్పున చెన్నైకి 15 టీఎంసీలు తీసుకెళ్లాలనేది దీని ఉద్దేశం. 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జీవో 170తో పోతిరెడ్డిపాడు విస్తరణకు తొలి అడుగువేశారు. నాలుగు తూములకు తోడు మరో ఏడుతూములు నిర్మించారు. దీంతో 11,500 క్యూసెక్కుల కెపాసిటీ కాస్తా 44వేల క్యూసెక్కులకు పెరిగింది. అంటే రోజుకు దాదాపు 4 టీఎంసీల నీటిని డ్రా చేసుకునే స్థాయికి పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుకున్నారు. పైగా శ్రీశైలం పూర్తిగా నిండకుండానే 854 అడుగుల మట్టం నుంచే మళ్లించుకునేలా అనుమతించారు. 2020 మేలో ఏపీలో జగన్ సర్కారు రాయలసీమ లిఫ్ట్ పేరుతో జీవో 203 జారీ చేసి, ఎలాంటి అనుమతులు లేకుండా పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టు చేపట్టింది. సంగమేశ్వరం నుంచి భారీగా నీటిని లిఫ్ట్ చేసి, పోతిరెడ్డిపాడు విస్తరణతో ఏకంగా రోజుకు 80వేల క్యూసెక్కుల నీటిని మళ్లించేలా వేగంగా పనులు చేపట్టారు. దీంతో పాటే బనకచర్ల రెగ్యులేటర్ కెపాసిటీ పెంపు, గాలేరు-నగరి కాలువల విస్తరణకు జగన్ సర్కారు అనుమతించింది. పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం మెయిన్ రైట్ కెనాల్ ద్వారా బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ కు చేరుకునే నీరు అక్కడ మూడు కాలువకు మళ్లుతుంది. ముఖ్యంగా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా తెలుగు గంగ కాలువతో చెన్నైకి మంచినీళ్లు అందిస్తున్నారు. బనకచర్ల నుంచి రెండో మార్గం శ్రీశైలం రైట్ కెనాల్ ద్వారా కర్నూలు, కడప జిల్లాల్లో పలు ప్రాంతాలకు నీరు అందుతుంది. అట్లాగే మూడో మార్గం గాలేరు-నగరి వరద కాలువ ద్వారా మరికొంత నీటిని మళ్లిస్తున్నారు. వీటికి తోడు కేసీ కెనాల్ సమాంతరంగా పోతూ సీమకు నీళ్లిస్తుంది. సంగమేశ్వరం లిఫ్ట్ ద్వారా శ్రీశైలం డెడ్ స్టోరీజీ నుంచి కూడా దొడ్డిదారిన నీళ్లను తీసుకోవడానికి ఏర్పాట్లు చేయడంతో ఈ కాల్వల కెపాసిటీని మరింత పెంచుకుంటున్నారు.