
గోదావరి వరద జలాలనే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్తున్నాం. దీని వల్ల తెలంగాణకు ఏమి నష్టం?’’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు వాదిస్తున్నా దాని వెనుక ఉన్న ఉద్దేశాలపై చాలా అనుమానాలు కలుగుతున్నాయి. గోదావరి వరద మళ్లింపు సాకుతో కృష్ణా నీటినే గంపగుత్తగా తరలించుకుపోయే కుట్ర జరుగుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. గోదావరి – బనకచర్ల (జీబీ) లింకును నేరుగా సాగర్కెనాల్కు కలపడం, అక్కడి నుంచి 150టీఎంసీల కెపాసిటీతో కట్టబోయే బొల్లపల్లి రిజర్వాయర్‌కు మళ్లించడమంటే కృష్ణా నీటి దోపిడీకీ ఇది మరో పోతిరెడ్డిపాడుగా మారుతుందనడంలో సందేహం లేదు.
కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో అదే అదనుగా కృష్ణా నీటిపై శాశ్వత హక్కులను సొంతం చేసుకునే ఆలోచనతోనే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును బాబు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా లెక్కాపత్రం లేకుండా, టెలీమెట్రీలు పెట్టకుండా కృష్ణా నీళ్లను అక్రమంగా మళ్లించుకుంటున్న ఏపీ పాలకులు గోదావరిని, కృష్ణాతో లింకు చేస్తూ ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తిచేస్తే ఏ నీళ్లు ఎటువెళ్తున్నాయో తెలుసుకునేలోపే తెలంగాణ మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే శ్రీశైలానికిభారీ రంధ్రాలు
నిజానికి జల దోపిడీకి వీలుగా ఇప్పటికే ఏపీ సర్కార్ శ్రీశైలానికి భారీ గండ్లు కొట్టింది. శ్రీశైలం వెనుక రైట్ మెయిన్ కెనాల్ మీద చిన్న తూముగా ఉన్న పోతిరెడ్డిపాడు ఇప్పుడు పెద్ద తిమింగలంలా మారి, శ్రీశైలాన్ని ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తోంది. నాలుగు దశాబ్దాల కింద ఒక టీఎంసీ నీళ్లు తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని ఇప్పుడు ఏకంగా రోజుకు 8 టీఎంసీలకు మించి తోడుకునే స్థాయికి పెంచుకున్నారు.
ALSO READ | భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి :ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
గతంలో నీటిమట్టాన్ని బట్టి మళ్లించడానికి మాత్రమే వీలుంటే ఇప్పుడు సంగమేశ్వరం రూపంలో లోతు నుంచి తోడి ఎత్తిపోసుకునేలా లిఫ్టులు రెడీ అవుతున్నాయి. ఇక్కడి నుంచే బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్‌కు నీటిని మళ్లిస్తుంటారు. వైఎస్ హయాంలో తెలంగాణ సెంటిమెంట్‌ను రలిగించడానికి పోతిరెడ్డిపాడు విస్తరణ అంశాన్ని ఒక ఆయుధంగా నాటి టీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుంది. అయితే తెలంగాణ సాకారమయ్యాక అదే పార్టీ అధినేత కేసీఆర్ సీఎంగా ఉండగా.. పోతిరెడ్డిపాడు గతంకంటే రెట్టింపు నీళ్ల దోపిడీకి వీలుగా విస్తరణ పనులు జరుగుతుంటే చూసీచూడనట్లు వదిలేశారు.
దీంతో ఏకంగా రోజుకు 8 టీఎంసీలు, అంతకుమించిన నీటిని మళ్లించుకునే కెపాసిటీతో పోతిరెడ్డిపాడు సిద్ధమైంది. పనుల మొదట్లోనే ఈ ముప్పును ‘వీ6-వెలుగు’ గుర్తించి హెచ్చరించినా కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం చేసింది. చివరికి 90 శాతం పనులు అయ్యాక ప్రైవేటు పిటిషన్ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఇప్పటికే సొరంగాలు సిద్ధంగా ఉండడం వల్ల ఎప్పటికైనా ముప్పు పొంచి ఉంది.