కృష్ణా జలాల తరలింపు కోసమే బనకచర్ల కుట్ర: హరీష్ రావు

కృష్ణా జలాల తరలింపు కోసమే బనకచర్ల కుట్ర: హరీష్ రావు

= 200 టీఎంసీల దోపిడీకి ప్లాన్
= బాబుతో బీజేపీ, రేవంత్ దోస్తీ చేస్తూ మోసం
= మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం వీడాలి 
= మీడియా కథనాలను చూసైనా కదలండి
= ‘వెలుగు’ కథనాన్ని పోస్ట్  చేసిన మాజీ మంత్రి హరీశ్  

హైదరాబాద్: ఏపీ  సీఎం చంద్రబాబు నాయుడు బనకచర్ల ద్వారా 200 టీఎంసీల కృష్ణా జలాలను తరలించుకునేందుకు కుట్రలు  పన్నుతుంటే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం వహిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఇవాళ ‘వెలుగు’ దినపత్రికలో ప్రచురితమైన ‘కృష్ణా నీటి దోపిడీకే బనకచర్ల’ అనే శీర్షికన ప్రచురితమైన కథనాన్ని జోడిస్తూ ట్వీట్ చేశారు. కనీసం మీడియాలో వస్తున్న కథనాలను చూసైనా కదలాలని పేర్కొన్నారు.  మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 10వేల క్యూసెక్కులను ఏపీ తరలించుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపించారు.  


"బనకచర్ల తో తెలంగాణకు ఏమి నష్టం" అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా మాట్లాడి మూడు రోజులైనా ఒక్కరూ గట్టిగా స్పందించలేదని ఆరోపించారు. ఈ సర్కారుకు తెలంగాణ నీటి ప్రయోజనాలు పట్టవా..? చంద్రబాబును అడ్డుకునే ధైర్యం, కేంద్రాన్ని అడిగే దమ్ము కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు లేదా? అని ప్రశ్నించారు. బాబుతో రేవంత్, బీజేపీ దోస్తీ చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బాబు, రేవంత్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందమేమిటన్నారు.  కాంగ్రెస్, బీజేపీ తీరు తెలంగాణ తాగు, సాగు నీటి రంగానికి గొడ్డలి పెట్టుగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వ జల దోపిడీని అడ్డుకోవాలన్నారు.