బనకచర్లపై ఏపీ స్పీడప్.. ఒకట్రెండు నెలల్లోనే ప్రాజెక్టును గ్రౌండ్ చేసేందుకు కసరత్తులు

బనకచర్లపై ఏపీ స్పీడప్.. ఒకట్రెండు నెలల్లోనే ప్రాజెక్టును గ్రౌండ్ చేసేందుకు కసరత్తులు
  • జూన్ 1న టెండర్లు పిలిచే యోచనలో ఏపీ సర్కారు
  • ప్రాజెక్టులో పలు మార్పులు చేసి డీపీఆర్​ సిద్ధం 
  • ప్రాజెక్టు కోసం అడుగడుగునా విద్యుత్​కేంద్రాల నిర్మాణం
  • 3.430 మెగావాట్ల సామర్థ్యంతో స్థాపించేందుకు కసరత్తులు
  • దాని ద్వారా రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందన్న యోచనలో ఏపీ

హైదరాబాద్, వెలుగు: గోదావరి బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్ట్​పై ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. వీలైనంత వేగంగా ప్రాజెక్ట్​ను గ్రౌండ్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నది. ఒకట్రెండు నెలల్లో ప్రాజెక్టును పట్టాలెక్కించే కుట్రలకు పాల్పడుతున్నది. జూన్ 1 నాటికి టెండర్లను పిలిచి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది.

అందుకు అనుగుణంగా ప్రాజెక్టులో పలు మార్పులు చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. దానికి సంబంధించిన డీపీఆర్​ను కూడా సిద్ధం చేసినట్టు తెలిపింది. ముందు అనుకున్నట్టుగా పోలవరం కుడి కాల్వ నుంచి బుడమేరు ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి నీటిని తరలించాలనుకున్న ప్రతిపాదనను ఏపీ విరమించుకున్నట్టు తెలిసింది. అయితే, తాడిపూడి ఎత్తిపోతల పథకంలోని 15వ కిలోమీటర్ నుంచి 166.50 కిలోమీటర్ వద్ద జక్కంపూడి వరకు ఓ సమాంతర కాలువను తవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.

గోదావరి పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీలోకి తరలించేందుకు నిర్ణయించినట్టు చెబుతున్నారు. దానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక అక్కడి నుంచి రోజూ 33 వేల క్యూసెక్కుల చొప్పున ముందు చెప్పిన ప్లాన్​లో భాగంగానే బొల్లాపల్లి రిజర్వాయర్​కు 6 లిఫ్టుల ద్వారా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి నుంచి నల్లమల రిజర్వాయర్​కు నీటిని తరలించి.. బనకచర్ల హెడ్​రెగ్యులేటర్​కు 22 వేల క్యూసెక్కుల నీటిని తరలించనున్నారు.

భారీ విద్యుత్ ప్లాంట్లు..
ప్రాజెక్టును రూ.81,800 కోట్లతో తలపెట్టనున్న ఏపీ.. నిర్వహణ భారం కాకుండా ప్రాజెక్టు పొడవునా విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లిఫ్ట్ ప్రాజెక్టులకు కరెంట్ ఖర్చులు భారం కాకుండా లిఫ్ట్​ చేసే నీటితోనే సొంతంగా కరెంటు తయారు చేసుకుని వాడుకోవాలని నిర్ణయించింది. ఇటు ఆదాయంతో పాటు అటు ప్రాజెక్టుకు కరెంట్ ఖర్చు లేకుండా చూసుకోవాలని ఏపీ ముందుకు వెళ్తున్నది.

అందులో భాగంగానే 3,430 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు చోట్ల 430 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఏపీ.. అందులో ఒకటి బొల్లాపల్లి రిజర్వాయర్ వద్ద 230 మెగావాట్లతో, సిద్ధాపురం వద్ద మరో 200 మెగావాట్ల ప్లాంట్ను కట్టాలని భావిస్తున్నది.

ఇంకో రెండు చోట్ల వెయ్యి మెగావాట్ల కెపాసిటీ కలిగిన పంప్డ్ స్టోరేజ్​లను ఏపీ ఏర్పాటు చేయనుంది. అందులో ప్రాజెక్ట్ 6స్టేజ్ అయిన గుత్తికొండ వద్ద రెండు చోట్ల 400 మెగావాట్లు, 600 మెగావాట్ల చొప్పున వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో 2,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఏపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ పవర్ ప్రాజెక్టుల ద్వారా ఏటా రూ.3,000 కోట్ల దాకా ఆదాయం వస్తుందని ఏపీ యోచిస్తున్నట్టు చెబుతున్నారు. వీటి ద్వారా వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు అందుతాయని ఏపీ భావిస్తున్నట్టు తెలిసింది. జీబీ లింక్ ప్రాజెక్ట్ కోసం జలహారతి పేరిట కొత్త కార్పొరేషన్​ను ఏర్పాటు చేసి రుణ సమీకరణ చేపట్టాలని ఏపీ కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

త్వరగా మేల్కొంటేనే..
ఏపీ జీబీ లింక్ ప్రాజెక్ట్​పై రాష్ట్ర సర్కారు మరింత వేగంగా ముందుకు వెళ్లకుంటే తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర భంగం కలిగే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు చేసినా.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఇటు గోదావరి రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) కూడా దానిపై స్పందించడం లేదు. జీబీ లింక్ ప్రాజెక్టుకు ఏపీ కేంద్రం నుంచి దొంగచాటుగా పర్మిషన్లను తెచ్చుకుంటున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏన్డీఏ ప్రభుత్వంలో ఏపీ అధికార పార్టీ ఉండడంతో ఈ ప్రాజెక్టుపై కేంద్రం ఇసుమంతైనా స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇటు కేంద్ర జలవనరుల సంఘానికీ ఏపీ ఎలాంటి డీపీఆర్​లను సమర్పించకుండానే ప్రాజెక్టు పనులపై ముందుకు వెళ్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై సీడబ్ల్యూసీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసినా ఏపీకి సీడబ్ల్యూసీ నుంచిగానీ, కేంద్ర జలశక్తి శాఖ నుంచిగానీ ఎలాంటి లేఖలు పంపలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వెనువెంటనే స్పందించాలన్న డిమాండ్లూ వినిపిస్తున్నాయి. మరోసారి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫిర్యాదులు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏపీ వేస్తున్న ఎత్తులకు కృష్ణా జలాల్లో మరింత గండి పడే ప్రమాదం పొంచి ఉంది.