మామిడి, మోసంబి తోటల రైతులు కాపు కోసం మూడు నుంచి ఐదేళ్ల వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ఆ పొలం నుంచి ఎలాంటి రాబడి ఉండదు. ఈ సమస్యను అధిగమించేందుకు నల్లగొండ జిల్లా రైతులు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. మామిడి, బత్తాయి తోటల్లో అంతర పంటగా అరటిని సాగు చేస్తూ ఎకరాకు లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు.
నల్లగొండ జిల్లాలో దాదాపు 50 మందికిపైగా రైతులు మామిడి, మోసంబి పొలాల్లో అరటి సాగును అంతర పంటగా వేసి.. ఆరు నెలల్లోనే రాబడి పొందుతున్నారు. జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం నక్కలపల్లికి చెందిన గోదాల కృష్ణ తన గ్రామంలోని ఐదెకరాల మామిడి పొలంలో అంతర పంటగా అరటి సాగు చేసి, గత సీజన్‌లో ఎకరానికి రూ.లక్ష లాభం పొందాడు. ముషంపల్లి గ్రామానికి చెందిన మరో రైతు రామస్వామి.. ఏడాదిన్నరగా లో మూడెకరాల్లో చక్కరకేళి రకం అరటి సాగు చేస్తున్నారు. టిష్యూ కల్చర్ ప్లాంటేషన్ కారణంగా మొక్కలు నిరంతరం దిగుబడిని ఇస్తున్నాయి. ఎకరాకు 30 క్వింటాళ్ల అరటి దిగుబడి వస్తుండటంతో సీజన్‌కు ఎకరాకు రూ.2 లక్షల లాభం ఆర్జిస్తున్నారు. దీంతో జిల్లాలోని అన్నారెడ్డి గూడెం, చెర్ల గైరారం తదితర ప్రాంతాల్లో మరికొందరు రైతులు సైతం అరటి సాగుకు ముందుకొస్తున్నారు.