ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: దుమ్ముగూడెం మండలం బండారిగూడెం మండల పరిషత్​ అప్పర్​ ప్రైమరీ స్కూల్​ రాష్ట్ర స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కార్​కు ఎంపికైనట్లు డీఈవో సోమశేఖర శర్మ తెలిపారు. రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికైన జాతీయ స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కార్​ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం నామినేట్​ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో 40 వేల పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్​కు రిజిస్ట్రేషన్​ చేసుకోగా, రాష్ట్ర స్థాయి అవార్డుకు బండారిగూడెం యూపీఎస్​ ఎంపిక కావడం పట్ల డీఈఓతో పాటు నోడల్​ అధికారి ఎస్కే​సైదులు హర్షం వ్యక్తం చేశారు. 

ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

ఖమ్మం టౌన్, వెలుగు: ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని టీపీటీఎఫ్  రాష్ట్ర అదనపు కార్యదర్శి పి‌‌‌‌ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ ఖాళీలను భర్తీ చేయకుండా ఎఫ్ఎల్ఎన్  వంటి వివిధ స్కీమ్​లు పెట్టి టీచర్లపై పనిభారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సరైన ఫలితాలు రావని తెలిపారు. పాఠశాలలకు గ్రాంట్స్  విడుదల చేయకుండా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. ఏండ్లుగా ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్ల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్​ విజయ్, రాష్ట్ర కౌన్సిలర్స్  కె నరసింహారావు, పీవీఆర్కే ప్రసాదరావు, వై పద్మ, జిల్లా నాయకులు కె సంధ్యారాణి, ఎం నాగిరెడ్డి, టి వెంగళరావు, ఎస్కే యాకూబ్ పాషా, నాగుల్ మీరా పాల్గొన్నారు.

డాక్టరమ్మకు  సీమంతం

తోటి ఉద్యోగుల అభిమానం

మెడికల్ ఆఫీసర్ కు తోటి ఉద్యోగులు సీమంతం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మండలకేంద్రంలోని పీహెచ్​సీ ఇన్​చార్జి మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న డాక్టర్ పల్లవి కుటుంబసభ్యులంతా హైదరాబాద్​లో ఉండడంతో సీమంతం ముచ్చట తీర్చాలని తోటి సిబ్బంది నిర్ణయించారు. తామే కుటుంబసభ్యులుగా మారి శాస్త్రోక్తంగా సీమంతం  నిర్వహించారు. వైద్యులు డాక్టర్  వైష్ణవి, డాక్టర్ మృదుల, డాక్టర్  సురేశ్, డాక్టర్ రవితేజ , ఏఎన్ఎంలు కృష్ణవేణి, మరేశ్వరి, రమాదేవి, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

- వేంసూరు, వెలుగు

బోనాల జాతర

ఖమ్మం సిటీలోని చర్చి కాంపౌండ్ లో ఉన్న ముత్యాలమ్మ గుడిలో బోనాలు సమర్పించేందుకు మహిళలు పోటెత్తారు. శ్రావణ మాసం చివరి ఆదివారం కావడంతో మొక్కులు చెల్లించేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు ప్రకాశ్​నగర్, ముస్తఫా నగర్, రిక్కాబ్ బజార్ సెంటర్ ల నుంచి భక్తులు వచ్చారు. ఇదిలాఉంటే ముదిగొండ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వాసులు బంగారు మైసమ్మ ఆలయం ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఊరేగింపుగా తరలివెళ్లి బోనాలు సమర్పించారు.     

- ఫొటోగ్రాఫర్ ఖమ్మం/ముదిగొండ, వెలుగు

30 పడకల ఆసుపత్రికి రూ.7.5 కోట్లు మంజూరు

పెనుబల్లి, వెలుగు: 30 పడకల ఆసుపత్రి బిల్డింగ్​ నిర్మాణానికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు రూ.7.5 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఇప్పటికే సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రూ. 35 కోట్లు, కల్లూరులో 30 పడకల ఆసుపత్రికి రూ.10.5 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. ఆదివారం మంత్రి హరీశ్​రావును హైదరాబాద్​లోని కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.

అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులివ్వాలి

చండ్రుగొండ, వెలుగు: రాష్ట్రంలో పని చేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్  జర్నలిస్ట్​ ఫెడరేషన్  రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె అనిల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం చండ్రుగొండలో అశ్వారావుపేట నియోజకవర్గ ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తున్నామని చెప్పారు. అనంతరం సంఘం నియోజకవర్గ కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్, ఉపాధ్యక్షులుగా పాషా, శివకుమార్, సహాయ కార్యదర్శిగా శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడిగా రబ్బాని ఎన్నికయ్యారు.