
కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామిని హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ రఘనందన్ తో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు కలెక్టర్ మనుచౌదరి, సీపీ అనురాధ, ఆర్డీవో చంద్రకళ బొకేలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
దత్తాత్రేయ కుటుంబ సమేతంగా మల్లికార్జునస్వామిని దర్శించుకొని ఆలయ గర్భగుడిలో శివలింగానికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖమండపంలో పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు, మెమొంటో అందజేశారు. అనంతరం ఒగ్గు పూజారులు దత్తాత్రేయకు, ఎంపీ రఘనందన్ కు గొంగళ్లు అందజేశారు.
కొండపోచమ్మ ఆలయంలో..
మల్లన్న దర్శనం అనంతరం దత్తాత్రేయ జగదేవ్పూర్ మండలం కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. గొల్ల కురుమలు ఆయనను సన్మానించారు. ఆలయానికి ఫంక్షన్ హాల్ కావాలని మాజీ సర్పంచ్ రజిత వినతిపత్రం అందజేయగా, ప్రత్యేక నిధులు కేటాయించి తప్పకుండా కట్టిస్తానని హామీ ఇచ్చారు.