బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా వర్షిత్ రెడ్డి నియామకంపై...అధిష్టానం పునరాలోచించాలి : బండారు ప్రసాద్

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా వర్షిత్ రెడ్డి నియామకంపై...అధిష్టానం పునరాలోచించాలి :  బండారు ప్రసాద్

నల్గొండ అర్బన్, వెలుగు : బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడి డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నియామకంపై అధిష్టానం పునరాలోచించాలని, లేదంటే తామే నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్  బండారు ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం నల్గొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 9 మంది సీనియర్లను కాదని, పార్టీ క్రియాశీలక సభ్యత్వం లేని వ్యక్తికి అర్ధరాత్రి జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

 పార్టీ నియమ, నిబంధనలను తుంగలో తొక్కి జిల్లా అధ్యక్షుడిని ఏకపక్షంగా ప్రకటించారని విమర్శించారు. జిల్లాకు చెందిన ఇద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. మనసును చంపుకొని పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీలో క్రమశిక్షణ తప్పుతోందని, రాష్ట్ర నాయకత్వంపై కేంద్ర నాయకులకు ఫిర్యాదు చేస్తామన్నారు. పార్టీ సీనియర్లు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోకుండా జిల్లా అధ్యక్షుడిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. క్రియాశీల సభ్యత్వం లేని వ్యక్తిని రెండోసారి అధ్యక్షుడిగా నియమించడం బాధాకరమన్నారు.