టీడీపీకి బిగ్ షాక్ - వైసీపీలోకి సీనియర్ నేత..!

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేతల హడావిడి ముమ్మరం అయ్యింది. ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు అభ్యర్థుల జాబితా ప్రకటించిన నేపథ్యంలో ఆశించిన సీటు దక్కని నేతల పార్టీ ఫిరాయింపులు  కూడా ఊపందుకున్నాయి. ముఖ్యంగాజగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేనలో ఈ ఫిరాయింపులు, అసమ్మతి సెగ ఎక్కువగా ఉంది. ఇప్పటికే టీడీపీకి పలు కీలక నేతలు రాజీనామా చేయగా తాజాగా మరో సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యాడని సమాచారం అందుతోంది.

బండారు సత్యనారాయణ ఆశించిన పెందుర్తి నియోజకవర్గం నుండి టికెట్ దక్కకపోవడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా పెందుర్తి సీటు జనసేనకు కేటాయించటంతో బండారు ఆగ్రహంగా ఉన్నారు. బండారుతో పాటుగా జనసేన కేటాయించిన ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖ సౌత్ నియోజకవర్గాల నుండి టీడీపీ నాయకులను కలుపుకొని వైసీపీలో చేరటానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరి, చంద్రబాబు బుజ్జగింపు చర్యలు ఫలించి బండారు టీడీపీలోనే కొనసాగుతారా లేక వైసీపీలో చేరతారా వేచి చూడాలి.

Also Read :జనంలోకి జగన్ - బస్సు యాత్ర షెడ్యూల్ రెడీ..