వైభవంగా ఆదికొండ పెద్ద దేవుళ్ల బండారు ఉత్సవం

వైభవంగా ఆదికొండ పెద్ద దేవుళ్ల బండారు ఉత్సవం

గద్వాల, వెలుగు: కురువ సామాజికవర్గానికి చెందిన ఆదికొండ పెద్ద దేవుళ్ల బండారు ఉత్సవం ఆదివారం గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో వైభవంగా నిర్వహించారు. దీనికి దేశవ్యాప్తంగా సుమారు పదివేల మందికి పైగా ఆదికొండ వంశస్తులు హాజరయ్యారు. దేశంలో ఎక్కడున్నా ఈ కార్యక్రమానికి వస్తారు. ఈ సందర్భంగా పట్టం కట్టే కార్యక్రమం నిర్వహించారు. 

ఇందులో భాగంగా ఏడాది నుంచి 16 ఏండ్ల వయస్సున్న మగవారిని పెండ్లి కొడుకులుగా ముస్తాబు చేశారు. వీరి తల్లులు పక్కన కూర్చుని ఒడి బియ్యం పోసుకున్నారు. ఈ తంతు ముగిసిన తర్వాత పక్కనే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గుడిని చూసి కొబ్బరికాయ కొట్టి తమ గుడారాలకు వెళ్లిపోయారు. దీన్ని రావిడి కార్యక్రమం అని అంటారు. సోమవారం పసుపు బండారు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని నిర్వాహకులు పెద్ద కిష్టన్న తెలిపారు.