- ప్రైవేట్ విద్యా సంస్థలు మూసివేత
- బంద్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వ బడుల వద్ద పోలీసుల పహారా
నిర్మల్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద తమపై పోలీసుల లాఠీ ఛార్జీని నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఇచ్చిన విద్యా సంస్థల బంద్ పిలుపు సక్సెస్ అయింది. ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ మూసి ఉంచగా ప్రభుత్వ బడులను మాత్రం తెరిచి ఉంచేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్, ముథోల్ సీఐ మల్లేశ్‌తో కలిసి ఎస్పీ జానకీ షర్మిల ట్రిపుల్ ఐటీ వద్దకు చేరుకొని పరిస్థితులను సమీక్షించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇతరులెవరినీ క్యాంపస్‌లోకి అనుమతించ లేదు.
ఏబీవీపీ ఇచ్చిన బంద్ పిలుపును విఫలం చేసేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ముందుగానే బంద్ పాటించగా.. అన్ని ప్రభుత్వ బడులను ఉదయం నుంచే తెరిచి ఉంచేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి బడి వేళలు ముగిసేవరకు బందోబస్తు చేపట్టారు.