? LIVE UPDATES :మాష్టర్ ప్లాన్ రగడ..కామారెడ్డి బంద్ 

కామారెడ్డి జిల్లా :  కామారెడ్డి కొత్త మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన భాగంగా బంద్ పాటిస్తున్నారు. రైతు ఐక్యవేదిక ఇచ్చిన బంద్ కు పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపాయి. స్థానిక రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కామారెడ్డి టౌన్ లో వ్యాపార సంస్థలను మూసి వేయిస్తున్నారు. బందుకు మద్దతుగా విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. మరోవైపు కామారెడ్డి నియోజకవర్గం బీజేపీ ఇన్ చార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉదయమే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

రైతుల ఆందోళన కేసీఆర్ పతనానికి నాంది

కామారెడ్డిలో రైతుల ఆందోళన ముఖ్యమంత్రి కేసీఆర్ పతనానికి నాంది అని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ‘ఎవరో రైతు చనిపోయాడని మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. రైతు చనిపోతే కేటీఆర్ ఎగతాళిగా, వ్యంగ్యంగా మాట్లాడుతారా..? రైతులంటే ఆయనకు చిన్నచూపా..?’అని ప్రశ్నించారు. దొడ్డి దారిన కాకుండా.. గ్రామసభ నిర్వహించి మాస్టర్ ప్లాన్ పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పేరుతో ఓట్లు దండుకున్న కేసీఆర్.. ఇప్పుడు రైతుల ఉసురు పోసుకున్నారని ఆరోపించారు. 

రైతులకు షబ్బీర్ అలీ మద్దతు

కామారెడ్డి రైతులకు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మద్దతు తెలిపారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆందోళన చేస్తున్న వారిని జిల్లా కలెక్టర్ అవమానించడం సరికాదని షబ్బీర్ అలీ అన్నారు. మాస్టర్ ప్లాన్ సవరిస్తామని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇటు కామారెడ్డి పట్టణంలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయాలని వ్యాపార, వాణిజ్య వర్గాలను కోరుతున్నారు. రైతుల భూములపై స్పష్టత ఇచ్చే వరకూ ఉద్యమాన్ని ఆపేదిలేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బైక్ ర్యాలీ చేపట్టిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇవాళ కామారెడ్డికి బండి సంజయ్

నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు బీజేపీ కార్యాలయం నుంచి కామారెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లనున్నారు. చనిపోయిన ఎల్లారెడ్డి రైతు పయ్యావుల రాములు కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించనున్నారు. ఇప్పటికే కామారెడ్డి బంద్ కు బీజేపీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. 

మాస్టర్​ప్లాన్​పై నిరసనలు ఎందుకంటే..

కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్​ ప్లాన్ ప్రపోజల్స్​పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి టౌన్, విలీన గ్రామాలు అడ్లూర్​, అడ్లూర్ ​ఎల్లారెడ్డి, టెకిర్యాల్​, ఇల్చిపూర్​, దేవునిపల్లి, లింగాపూర్​, సరంపల్లి,  పాతరాజంపేట, రామేశ్వర్​పల్లి కలుపుకొని 61.5 చదరపు కిలోమీటర్ల పరిధికి సంబంధించి ఢిల్లీకి చెందిన ఒక కన్సల్టెన్సీ మాస్టర్​ ప్లాన్ ​రూపొందించింది. దీంతో డ్రాఫ్ట్ ​రిలీజ్​ చేసిన అధికారులు 2023 జనవరి 11 వరకు అభ్యంతరాలు చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చారు.  

ప్లాన్​లో ఇక్కడ  8.5 శాతం ఏరియా 1,200 ఎకరాల భూమిని ఇండస్ట్రీయల్​ కింద ప్రతిపాదించారు. ఇందులో దాదాపు 900 ఎకరాలు నేషనల్​ హైవే పక్కన..టౌన్​ కు దగ్గరగా ఉన్న భూములే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా పచ్చని పంటలు పండే అడ్లూర్​, ఇల్చిపూర్​, టెకిర్యాల్​, అడ్లూర్​ ఎల్లారెడ్డి గ్రామాలకు చెందిన భూములు ఉండడంతో ఆయా గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. ఇండస్ట్రియల్​ జోన్​లో ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్​ రాదని, నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వవని, ఫలితంగా భూముల విలువ తగ్గుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఎవరినీ సంప్రదించకుండా.. తమకు చెప్పకుండా మాస్టర్​ ప్లాన్​ ఎలా తయారు చేస్తారంటూ  రైతులు నిలదీస్తున్నారు.  100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదన మీదా రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 

రూలింగ్​ పార్టీ లీడర్ల వెంచర్లకు ఉపయోగపడేలా ఈ రోడ్డు ప్రపోజ్​ చేశారని, దీని వల్ల తమ విలువైన భూములు పోతాయని అంటున్నారు. లింగాపూర్​, దేవునిపల్లి, అడ్లూర్​, ఇల్చిపూర్​, టెకిర్యాల్​, అడ్లూర్​ ఎల్లారెడ్డి రైతులు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఆందోళనలు ప్రారంభించారు. మున్సిపల్​ ఆఫీసు ఎదుట ధర్నా, కమిషనర్​, టౌన్​ ప్లానింగ్​ ఆఫీసర్ల ఘెరావ్​, ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ ఇంటి  ముట్టడి, భిక్షాటన వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం నుంచి మున్సిపల్​ ఆఫీసు ఎదుట నిరసన దీక్షలు చేస్తున్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి రైతు రాములు అత్మహత్య చేసుకోగా బుధవారం డెడ్​బాడీతో ఆందోళన చేశారు.

నిన్న రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కామారెడ్డి కలెక్టరేట్​ ముందు బైఠాయించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పలువురు గాయపడ్డారు. కొందరు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. ర్యాలీలు, ధర్నాలతో దాదాపు 10 గంటల పాటు కామారెడ్డి పట్టణంలో హైటెన్షన్​ వాతావరణం నెలకొంది. మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా నెలరోజులుగా ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం, తన భూమి ఇండస్ట్రియల్​ జోన్​లోకి పోతే తనకు నష్టం జరుగుతుందన్న ఆవేదనతో రాములు అనే రైతు బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో సర్కారుపై రైతులు కన్నెర్ర చేశారు.