కరీంనగర్: పగలు, పంతాలు, రాజకీయ కక్షలతో సాధించేదేమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని, ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుద్దామని కోరారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ ప్రోటోకాల్ పాటించలేదని, కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా దారి మళ్లించిందని మండిపడ్డారు.
కమీషన్లు, పేరు ప్రఖ్యాతలకే ప్రాధాన్యమిచ్చిందే తప్ప నిబంధనల ప్రకారం పనిచేయలేదని, అధికారులను కూడా పని చేసుకోనివ్వలేదని అన్నారు. మల్యాల నుంచి కాచారం వరకు రోడ్డు విస్తరణ కోసం రూ.25 కోట్ల నిధులు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి, నితిన్ గడ్కారీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మోదీ హయాంలో రాష్ట్రానికి అత్యధిక సీఆర్ఐఎఫ్ నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గొడవలు పక్కనపెట్టి రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.