కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటదో.. ఊడుతదో?

కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటదో.. ఊడుతదో?
  • ఐఏఎస్ లు తప్పు చేయాలని ముఖ్యమంత్రే చెప్పడం సిగ్గుచేటు: బండి సంజయ్
  • కొందరు మంత్రులు ప్రతి పనికి 15 % కమీషన్ తీసుకుంటున్నరు 
  • కుల గణనతో కాంగ్రెస్.. కొరివితో తల గోక్కుంటోందని వ్యాఖ్య

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. ఒక్క తప్పు చేయాలని అంటే.. ఐఏఎస్ లు మూడు తప్పులు చేస్తున్నారని సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. 

సీఎంగా ఉంటూ అవినీతిని, తప్పులను నిరోధించాల్సింది పోయి తప్పులు చేయాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి అధ్యక్షతన వివిధ జిల్లాల అధ్యక్షులు, మండల అధ్యక్షుల సమావేశం సోమవారం జరిగింది. 

ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్  గ్రాడ్యుయేట్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణా రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు,  ఎన్నికల ఇన్​చార్జ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కొందరు మంత్రులు సొంత దుకాణాలు ఓపెన్ చేసి.. ప్రతి పనికి 15 శాతం చొప్పున కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.56 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు స్కూటీ, తులం బంగారం, ప్రతి ఉద్యోగికి పీఆర్సీ, 4 డీఏలు, రైతులకు రైతు భరోసా, బోనస్, రుణమాఫీ బాకీ పడిందన్నారు. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని ఎద్దేవా చేశారు. 

నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగుల పక్షాన నిరంతరం కొట్లాడి జైలుకు పోయింది తామేనన్నారు. కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ కొరివితో తలగోక్కుంటోందని అన్నారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపితే కేంద్రం ఎట్లా ఆమోదిస్తుందని ప్రశ్నించారు. కొందరు క్రైస్తవులు ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకుంటూ ఎస్సీలకు నష్టం చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు.