ముగిసిన బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర

బండి సంజయ్ 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగిసింది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ముగింపు సభ ఏర్పాటు చేయగా..ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, ఎంపి అరవింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్ సహా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు.

నవంబర్ 28న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైంది. ఐదు జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర సాగింది. గత నాలుగు విడతల్లో 21 జిల్లాల్లోని 13 లోక్ సభ, 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,178 కిలో మీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. 

బండి సంజయ్ నాల్గో విడత పాదయాత్రను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. హైదరాబాద్ శివారులోని 9 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 10 రోజుల పాటు పాదయాత్ర కొనసాగింది. ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఆలస్యమైంది.