కేంద్ర బడ్జెట్ దేశ హిత బడ్జెట్ : బండి సంజయ్

 కేంద్ర బడ్జెట్ దేశ హిత బడ్జెట్ : బండి సంజయ్
  • అభివృద్ధి, సంక్షేమానికి సమపాళ్లలో కేటాయింపు
  • మోదీ విజన్​కు అద్దం పట్టేలా ఉంది: బండి సంజయ్

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ దేశ హిత బడ్జెట్ గా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ బడ్జెట్ ప్రధాని నరేంద్ర మోదీ విజన్​కు అద్దం పట్టేలా ఉందని అన్నారు. నాగలికి రెండు ఎడ్ల మాదిరిగా సమపాళ్లలో అభివృద్ధి, సంక్షేమం ప్రతిబింబించేలా బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయన్నారు. ఈ మేరకు మంగళవారం సంజయ్ ఆఫీసు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యతనిచ్చామన్నారు. తెలంగాణకు నిధులివ్వలేదని కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చేస్తున్న విమర్శలు వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. 

తెలంగాణ సహా దేశంలోని వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధుల కేటాయించిందని చెప్పారు. హైదరాబాద్-– బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్ లో 210 కి.మీలు తెలంగాణలో భాగమేననే విషయం తెల్వదా?, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని నిపుణులు తేల్చిన సంగతి మర్చిపోయారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని అనాటి ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఓట్ల కోసం పైసలు పంచుడు.. దంచుడు.. అప్పుల్లో ముంచుడు తప్ప కాంగ్రెస్, బీఆర్ఎస్ సాధించిందేమి లేదన్నారు. ఇకనైనా తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర సహాయ సహకారాలపై నిర్మాణాత్మక సలహాలివ్వాలని ఇరు పార్టీల నేతలకు సూచించారు. మౌలిక రంగాలకు అత్యధిక నిధుల కేటాయింపు భేష్ అని పేర్కొన్నారు. వ్యవసాయం, విద్యకు మోదీ సర్కార్ పెద్దపీట వేసిందన్నారు. దాదాపు మూడు కోట్ల మంది పేదలకు ఇండ్లు నిర్మించేలా బడ్జెట్ ప్రతిపాదనలు జరిగాయని చెప్పారు.