కాంగ్రెస్ కేరాఫ్.. కమీషన్ల సర్కార్ : బండి సంజయ్‌‌‌‌

కాంగ్రెస్ కేరాఫ్.. కమీషన్ల సర్కార్ : బండి సంజయ్‌‌‌‌
  • 14 శాతం కమీషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులు మంజూరవుతున్నయ్: బండి సంజయ్‌‌‌‌
  • కమీషన్​ విషయంలో మంత్రుల మధ్య వార్ మొదలైంది
  • ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టడంపై ఉన్న శ్రద్ధ  ప్రజా సమస్యలపై లేదని ఫైర్​

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు చేయాలన్నా 8 నుంచి 14 శాతం కమీషన్లు దండుకుంటోందని కేంద్రమంత్రి బండి సంజయ్​ఆరోపించారు. కమీషన్లపై కాంగ్రెస్​లోనే అంతర్యుద్ధం నడుస్తోందని.. అది ఎప్పుడైనా బద్దలు కావొచ్చన్నారు. ఢిల్లీ నేతలకు కప్పం కడుతూ.. తమ సీటును కాపాడుకోవడానికే కాంగ్రెస్ పాలకులు పరిమితమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు మంజూరుకాక మాజీ సర్పంచులు రోడ్డున పడ్డా.. రేవంత్​రెడ్డి సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదని ధ్వజమెత్తారు.

సోమవారం మధ్యాహ్నం తాజా మాజీ సర్పంచుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కరుణాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల నాయకులు లక్ష్మీరాజం, శ్రీనివాస్, ఎల్లం, నర్సింహారెడ్డి, జేఏసీ నాయకులు కరీంనగర్ లో బండి సంజయ్ ని ​కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. మాజీ సర్పంచులకు దాదాపు రూ.1,300 కోట్ల బిల్లులు రావాల్సి ఉందన్నారు. ఒక్కో సర్పంచుకు రూ.3 లక్షల నుంచి రూ.కోటి వరకు బిల్లులు పెండింగ్​ఉన్నాయన్నారు. 

రాష్ట్రంలో క్రైం రేటు పెరిగింది..

రాష్ట్రంలో 22%  క్రైం రేటు పెరిగిందని, మహిళలపై అత్యాచారాలు 28%  పెరిగాయని బండి సం జయ్​ ఆరోపించారు. శాంతి భద్రతలను కాపాడలేని చేతగాని సర్కార్ కు ప్రజల బాధలు పట్టవని విమర్శించారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు ముగిసిన అంశమని, ఈ అంశంపై అసెంబ్లీలో  గంటల తరబడి చర్చ జరపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 'పవన్ ఏమన్నారో నాకు తెల్వదు. నిజంగా గొప్ప నాయకుడు అని ఉంటే.. ఆయనలో గొప్ప లీడర్​ ఎట్లా కన్పించారో వారికే తెలియాలి’అని పేర్కొన్నారు.  

అంబేద్కర్​ను అవమానించిందే  కాంగ్రెస్ పార్టీ..

అంబేద్కర్​ను కాంగ్రెస్​ అగడుగునా అవమానించిందని సంజయ్ ​ఆరోపించారు. ‘‘ఆయనకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు? ఆయన లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించేందుకు ఎందుకు ప్రయత్నించింది? మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలు జరపకుండా ఎందుకు అవమానించారు? నాటి ప్రధాని వీపీ సింగ్ విషయంలో ఇట్లనే అవమానించింది నిజం కాదా? మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నన్నాళ్లూ సోనియాగాంధీ సూపర్ పీఎంగా ఉంటూ రబ్బర్ స్టాంప్ గా తయారు చేసింది నిజం కాదా? కాంగ్రెస్ తీరును చూసి మన్మోహన్ సింగ్ ఆత్మ క్షోభిస్తోంది’’ అని బండి సంజయ్​ వ్యాఖ్యానించారు.