
- అంబేద్కర్, జగ్జీవన్ రామ్‌ను అవమానించింది: బండి సంజయ్
- జగ్జీవన్ రామ్ ఆశయసాధనకు మోదీ ప్రభుత్వం కృషి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై అధిష్టానానిదే తుది నిర్ణయం
- హెచ్‌సీయూ విద్యార్థులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి
హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్‌ను అడుగడుగునా కాంగ్రెస్ అవమానించిందని, ఆ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ‘‘ఇందిరాగాంధీ తర్వాత దేశాన్ని పాలించే అర్హత బాబు జగ్జీవన్ రామ్‌కు ఉన్నప్పటికీ ఆయనకు ఇవ్వలేదు. అంబేద్కర్‌ను పార్లమెంట్లో అవమానించి మంత్రి పదవికి కాంగ్రెస్ రాజీనామా చేయించింది” అని అన్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన చిత్ర పటానికి బండి సంజయ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మాట్లాడారు. అట్టడుగువర్గాల ఆణిముత్యం బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కొనసాగుతున్నవన్నీ ఊహగానాలే. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. హెచ్‌సీయూ భూముల విషయంలో విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
విద్యార్థులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూముల అమ్మకాల్లో బీఆర్ఎస్ను మించి కాంగ్రెస్ పోటీ పడుతున్నదని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో భూములమ్మి రూ.20 వేల కోట్లు దోచుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు మించి దోచుకునేందుకు సిద్ధమైందని దుయ్యబట్టారు. ‘‘బీజేపీ కార్యకర్తలు రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ ఫొటోలు పెడితే.. చించివేయడం ఏమిటి? రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ఇస్తున్నది మోదీ ప్రభుత్వం బియ్యమే.
అయినప్పటికీ సన్నబియ్యం పేరుతో కాంగ్రెస్ తామే సొంతంగా పంపిణీ చేస్తున్నట్లు డ్రామాలాడుతున్నది” అని ఆయన వ్యాఖ్యానించారు. వెంటనే రేషన్ షాపుల్లో మోదీ ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ బియ్యం తీసుకుంటున్న పేదల ఇండ్లకు వెళ్లి భోజనం చేసి సమస్యలు తెలుసుకోవాలని బీజేపీ మండలాధ్యక్షులకు బండి సంజయ్ సూచించారు.