
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఆర్టికల్ 243 ప్రకారం రాష్ట్రాలకు అమలు చేసుకునే హక్కుందని పేర్కొన్నారు. హామీ అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే 42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల టైమ్ లో హామీ ఇచ్చారా? ఇప్పుడెందుకు మోదీ ప్రభుత్వంపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు? రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని షో చేయడం కాదు. ఆ రాజ్యాంగంలో ఏముందో అర్థం చేసుకొని అమలు చేయాలనే జ్ఞానం కాంగ్రెస్ నేతలకు ఉండాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ ఉంది. బీఆర్ఎస్ సపోర్ట్ కూడా ఉంది. బీజేపీపై ఎందుకు నెపం నెడుతున్నారు? ఇది ముమ్మాటికీ పలాయనవాదమే”అని అన్నారు.
మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం
80 శాతం ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి బీసీల పొట్టకొడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో56 శాతానికిపైగా ఉన్న బీసీ జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే 42 శాతానికి తగ్గించిందని, ఆ 42 శాతం రిజర్వేషన్ల బిల్లులో 10 శాతం మంది ముస్లింలే ఉన్నారని తెలిపారు. ఈ బిల్లు వల్ల ముస్లింలు అదనంగా 10 శాతం రిజర్వేషన్ల లబ్ధి పొందితే, బీసీలకు అదనంగా దక్కేది 5 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికే బీసీ రిజర్వేషన్ హామీ ఇచ్చారా? అని ప్రశ్నించారు.
మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ ముమ్మాటికీ వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. ‘‘బీసీలకు ఇంతటి ఘోరమైన అన్యాయం జరుగుతుంటే బీసీ సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? పైగా కాంగ్రెస్ ను సంకనేసుకుని ఢిల్లీకిపోయి ధర్నాల పేరుతో డ్రామాలాడడం ఎంతవరకు కరెక్ట్? కాంగ్రెస్, బీసీ సంఘాల తీరును బలహీనవర్గాల ప్రజలతోపాటు తెలంగాణ సమాజమంతా గమనిస్తున్నది. సమయం వచ్చినప్పుడు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు’అని బండి సంజయ్ పేర్కొన్నారు.