బోయినిపల్లి, వెలుగు: బోయినిపల్లి మండలం వరదవెల్లి గ్రామం మిడ్ మానేర్ బ్యాక్ వాటర్‌లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. దత్తాత్రేయ స్వామి జయంత్యుత్సవాల్లో భాగంగా మంగళవారం ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ పూజారులు ఆశీర్వాదం ఇచ్చి స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ సమస్యలను అర్చకులు, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వరదవెల్లి గ్రామం మిడ్ మానేర్‌లో మునగడంతో ఆలయం చుట్టూ నీరు చేరిందని, భక్తులు ఆలయానికి రావడానికి తక్షణమే బోటు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ జిల్లా ఇన్‌చార్జి మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మోహన్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మహాశక్తి టెంపుల్‌లో అయ్యప్ప పడిపూజ
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలోని శ్రీమహాశక్తి ఆలయంలో మంగళవారం రాత్రి కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి పడిపూజ, ఫల పంచామృతాభిషేకం నిర్వహించారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.