
- బీదర్లో ఆ పార్టీ అగ్రనేత ప్రింటింగ్ ప్రెస్లో ఈ వ్యవహారం నడిచింది
- ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగ నోట్లే
- లిక్కర్ దొంగలంతా ఒకే చోట జమై డ్రామాలాడుతున్నరు
- కరీంనగర్లో ఎమ్మెల్సీల సన్మాన సభలో వ్యాఖ్యలు
కరీంనగర్, వెలుగు: బీదర్లో బీఆర్ఎస్ అగ్రనేతకు ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని.. ఆ ప్రెస్లో బీఆర్ఎస్ పాంప్లెంట్స్ కాకుండా దొంగనోట్లు ముద్రించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో సిద్దిపేట ఎస్పీగా పనిచేసిన ఆఫీసర్ తనకు ఈ విషయం చెప్పారని ఆయన తెలిపారు. ఆ ప్రెస్ను సీజ్ చేసేందుకు ఆయన వెళ్తుంటే.. రాష్ట్రంలోని ముఖ్యనాయకుడు ఫోన్ చేసి ఆపినట్టు ఆయన చెప్పారని వెల్లడించారు. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగనోట్లేనని, అప్పుడు ఆ నోట్లు ఎలా చెల్లాయోనని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పాస్ పోర్టు, దొంగనోట్ల దందా చేసిన కుటుంబం వేల కోట్లు సంపాదించిందని సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆదివారం తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లిక్కర్ దొంగలంతా ఒకే చోట సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. 'దేశ జీడీపీలో దక్షిణాది వాటా 36 శాతం ఉన్నందున పార్లమెంట్ లో కూడా దక్షిణాదికి 36 శాతం వాటా ఇవ్వాలని అడుగుతున్నరు.
ఇదేం విచిత్రం? దేశ జీడీపీకి పార్లమెంట్ లో ప్రాతినిధ్యానికి సంబంధమేంది? అట్లనుకుంటే తెలంగాణ జీడీపీలో వెనుకబడ్డ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అంత మాత్రాన అసెంబ్లీలో వాటికి ప్రాతినిథ్యం ఉండకూడదా? ఇదెక్కడికి దిక్కుమాలిన ప్రతిపాదన? దక్షిణాది పేరుతో రాజకీయాలు చేస్తూ డీలిమిటేషన్ ను అడ్డుకునే కుట్రలు చేయడమేంది?' అని ఫైర్ అయ్యారు. ఏ ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అర్బన్ నక్సల్స్ను విద్యా కమిషన్లో నియమించారో సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.